తాగునీటి పథకాలు..
సాగునీటి సరఫరా బంద్..
రిజర్వాయర్‌లో ఏడు మీటర్లు తగ్గిన నీటిమట్టం
● నిత్యం 7.66 కోట్ల లీటర్ల నీరు
సరఫరా
● జిల్లాలోని 255 గ్రామాలు..
6.46 లక్షల జనాభా
● ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో
మిషన్ భగీరథ అధికారులు
మండలంతో పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో నెలకొన్న తాగునీటి ఎద్దడి తీర్చేందుకు పాలకులు, అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలి. ట్యాంకర్ల ద్వారా సరఫరా చేయడంతో పాటు రామన్‌పాడు రిజర్వాయర్ నుంచి నిత్యం నీటి సరఫరా అయ్యేవిధంగా శాశ్వత చర్యలు చేపట్టాలి. రిజర్వాయర్‌లో నీటిమట్టం తగ్గిపోతుండటంతో పాలకులు, అధికారులే బాధ్యత వహించి ప్రజల తాగునీటి కష్టాలు తీర్చాలి.
– రాజు,
సీపీఎం మండల కార్యదర్శి, ఆత్మకూర్
జిల్లాలోని తాగునీటి పథకాల నుంచి నిత్యం 7.66 కోట్ల లీటర్ల నీటిని సరఫరా చేస్తున్నాం. ప్రస్తుతం పథకాలకు నీటికొరత లేదు. ముందస్తుగా 1,150 బోరుబావులు, 450 చేతిపంపులతో పాటు ట్యాంకర్లను సిద్ధం చేసుకున్నాం. జిల్లా ప్రజలు తాగునీటి విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇబ్బందులు రానివ్వం.
– అంజద్‌పాషా,
ఈఈ, మిషన్ భగీరథ, వనపర్తి
రామన్‌పాడు రిజర్వాయర్‌లో
ప్రస్తుత నీటిమట్టం
ఆత్మకూర్: జిల్లా ప్రజల తాగునీటి అవసరాలు తీరుస్తున్న రామన్‌పాడు రిజర్వాయర్‌లో రోజురోజుకు నీటిమట్టం తగ్గుముఖం పడుతోంది. ఇప్పటివరకు ఏడు మీటర్ల మేర నీటిమట్టం తగ్గింది. ఒకవేళ రిజర్వాయర్‌లో నీటిమట్టం పూర్తిగా తగ్గితే జిల్లాలోని అనేక గ్రామాలు తాగునీటి ఎద్దడి ఎదుర్కోవాల్సిన పరిస్థితి నెలకొననుంది. మిషన్ భగీరథ పథకం ద్వారా నిత్యం జిల్లాలోని 6.46 లక్షల మందికి 7.66 కోట్ల లీటర్ల నీటిని సరఫరా చేస్తున్నారు. వేసవి నేపథ్యంలో మే, జూన్ నెలల్లో తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకుంటూ బోరుబావులు, చేతిపంపులు, ట్యాంకర్లను అధికారులు సిద్ధం చేస్తున్నారు. ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు అనుసంధానంగా రామన్‌పాడు రిజర్వాయర్‌ను నిర్మించారు. రిజర్వాయర్‌లోని నీటితో పాటు జూరాల ప్రధాన, సమాంతర కాల్వ ద్వారా నిత్యం తాగు, సాగునీటి సరఫరా కొనసాగుతోంది. గతంలో రామన్‌పాడు రిజర్వాయర్ నుంచి ఉమ్మడి జిల్లాలోని 500 గ్రామాలకు 30 ఎంఎల్‌డీ నీటిని సరఫరా చేస్తుండేవారు. ప్రస్తుతం శ్రీశైలం వెనుక జలాల నుంచి పలు పథకాలకు తాగునీరు సరఫరా అవుతుండటంతో రామన్‌పాడుపై భారం తగ్గింది. ప్రస్తుతం రెండు పథకాలకు 10.4 ఎంఎల్‌డీ నీటిని వినియోగిస్తున్నారు. రిజర్వాయర్‌లో 1022.06 అడుగుల నీటిమట్టం ఉండాల్సి ఉండగా.. బుధవారం 1020.09 అడుగులకు చేరింది.
వనపర్తి జిల్లాలో 255 గ్రామాలు, 6.46 లక్షల జనాభా ఉంది. నిత్యం 1.05 లక్షల కొళాయిల ద్వారా 76 ఎంఎల్‌డీ (7.66 కోట్ల లీటర్లు) తాగునీటిని సరఫరా చేస్తున్నారు. దీంతో పాటు చేతిపంపులు 451, సింగిల్‌ఫేస్ బోరుమోటార్లు 460, త్రీఫేజ్ బోర్లు 687, బావుల్లో మోటార్లు 38 సిద్ధంగా ఉండగా గ్రామపంచాయతీల్లో ట్యాంకర్లు, ప్రైవేట్ బోర్లు సిద్ధంగా ఉన్నాయని అధికారులు చెబుతున్నారు.
శ్రీశైలం వెనుక జలాల నుంచి నాగర్‌కర్నూల్ జిల్లా గౌరిదేవిపల్లి 77 ఎంఎల్‌డీ తాగునీటి పథకం ద్వారా జిల్లాలోని 8 గ్రామాలకు నీరు సరఫరా చేస్తున్నారు. అలాగే గోపాల్‌పేట 10 ఎంఎల్‌డీ పథకం ద్వారా 44 గ్రామాలు, బుగ్గపల్లి 75 ఎంఎల్‌డీ పథకం ద్వారా 87 గ్రామాలు, పాన్‌గల్ 5 ఎంఎల్‌డీ పథకం ద్వారా 19 గ్రామాలు, వీపనగండ్ల 4 ఎంఎల్‌డీ పథకం ద్వారా 20 గ్రామాలు, ఆత్మకూర్ 2.4 పథకం ద్వారా 12 గ్రామాలు, నందిమళ్ల సత్యసాయి 2 ఎంఎల్‌డీ పథకం ద్వారా 12 గ్రామాలు, కొల్లాపూర్ 31 ఎంఎల్‌డీ పథకం ద్వారా 58 గ్రామాలకు నిత్యం తాగునీటిని సరఫరా చేస్తున్నారు. పురపాలికలకు 27.6 ఎంఎల్‌డీ, గ్రామాలకు 48.435 ఎంఎల్‌డీ నీటిని అందిస్తున్నారు.
ఇదిలా ఉండగా ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు ప్రధాన ఎడమ కాల్వ ద్వారా నిత్యం 350 క్యూసెక్కుల సాగునీరు విడుదల చేస్తుండేవారు. ప్రాజెక్టులో నీటిమట్టం తగ్గిపోవడంతో ఉన్న నీటిని ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాలకు కేవలం తాగునీటి అవసరాలకు మాత్రమే వినియోగిస్తున్నట్లు పీజేపీ అధికారులు తెలిపారు. పీజేపీ, మిషన్ భగీరథ అధికారులు సమన్వయంతో ముందుకెళ్తే తాగునీటి కష్టాలు తలెత్తవు.


