గోపాల్‌పేట: రైతులు భూసార పరీక్షలు చేయించి తరచూ పంటమార్పిడి చేస్తూ సాగు చేపడితే అధిక దిగుబడులు, లాభాలు పొందవచ్చని కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. ప్రజాపాలన.. ప్రగతి ప్రణాళిక రైతు వారోత్సవాల్లో భాగంగా బుధవారం మండల కేంద్రంలోని రైతువేదికలో మండల సహకార సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఈ నెల నాలుగు నుంచి తొమ్మిదో తేదీ వరకు జిల్లాలో రైతు వారోత్సవాలు నిర్వహిస్తున్నామని.. ఆయా కార్యక్రమాల్లో రైతులు పాల్గొని పంటల సాగుపై అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు అందిస్తున్న రాయితీలు, ప్రోత్సాహకాలు, బ్యాంకు రుణాలు తదితర అంశాల గురించి తెలుసుకోవాలని సూచించారు. భూసార పరీక్ష ఫలితాలతో రైతులు ఏ పంటలు సాగు చేయాలనే విషయం తెలుస్తుందని.. భూసార పరీక్షల కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కిసాన్ క్రెడిట్ కార్డును సద్వినియోగం చేసుకోవాలని.. దీనిద్వారా రైతుకు కేవలం 7 నుంచి 9 శాతం వడ్డీతో రుణాలు అందుతాయని, సకాలంలో చెల్లిస్తే ప్రభుత్వం మూడు శాతం వరకు వడ్డీ తిరిగి అందజేస్తుందని చెప్పారు. ఏటా ఒకేరకమైన పంటలు సాగు చేయడంతో భూసారం కోల్పోయి దిగుబడి తగ్గుముఖం పడుతుందని.. పంటమార్పిడితో అధిక దిగుబడులు, లాభాలు వస్తాయని చెప్పారు. జిల్లాలో గన్నీబ్యాగుల కొరత రానివ్వమని.. పశ్చిమ బెంగాల్ ఎన్నికలు, పశ్చిమ ఆసియా యుద్ధాలతో సరఫరాలో జాప్యం జరిగిందని, త్వరలో అధిగమిస్తామని చెప్పారు. బుధవారం రేవల్లి మండలానికి పదివేల గన్నీబ్యాగులు పంపించామని.. మిగిలిన మండలాల్లో కూడా కొరత లేకుండా చూస్తామని వివరించారు. అలాగే మొక్కజొన్న కొనుగోళ్లను సైతం వేగవంతం చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ రఘు, రీజినల్ డిప్యూటీ డైరెక్టర్ ప్రసాదరావు, జిల్లా కో–ఆపరేటివ్ అధికారి రాణి, జిల్లా వ్యవసాయ అధికారి ఆంజనేయులు, నాబార్డ్ డీడీఎం మనోహర్‌రెడ్డి, ఎల్‌డీఎం శివకుమార్, స్థానిక అధికారులు పాల్గొన్నారు.
కనీస సౌకర్యాలు కల్పించాలి..
వనపర్తి రూరల్: వరి కొనుగోలు కేంద్రాల్లో రైతులకు తాగునీరు, నీడ తదితర కనీస సౌకర్యాలు కల్పించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. బుధవారం చిట్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో మార్కెట్‌యార్డులో ఏర్పాటు చేసిన అంబలి కేంద్రం, చలివేంద్రాన్ని మార్కెట్ కమిటీ చైర్మన్ బండారు శ్రీనివాస్‌గౌడ్, మార్కెటింగ్ అధికారి స్వరణ్‌సింగ్‌తో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మార్కెట్‌కు వచ్చిన రైతులకు అంబలి, తాగునీరు అందించారు. జిల్లాలోని మిగిలిన అన్ని కొనుగోలు కేంద్రాలు, మార్కెట్‌యార్డుల్లోనూ అంబలి కేంద్రాలు, చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు.
కలెక్టర్ ఆదర్శ్ సురభి


