వాణిజ్య పంటలతో లాభాలు బాగు | - | Sakshi
Sakshi News home page

వాణిజ్య పంటలతో లాభాలు బాగు

May 7 2026 7:38 AM | Updated on May 7 2026 7:38 AM

రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి

వనపర్తిటౌన్‌: రైతులు వరి మాత్రమే కాకుండా ఆయిల్‌పాం, పప్పుగింజలు, కూరగాయల సాగు చేపట్టాలని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి సూచించారు. ప్రజాపాలన.. ప్రగతి ప్రణాళికలో భాగంగా బుధవారం జిల్లాకేంద్రంలోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో ఉద్యాన, పట్టు పరిశ్రమలశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు అవగాహన సదస్సుకు ఆయనతో పాటు కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా చిన్నారెడ్డి మాట్లాడుతూ.. దేశంలో డిమాండ్‌ ఉన్న వాణిజ్య పంటలు సాగు చేసి అధిక లాభాలు పొందాలని, వరికి ప్రత్యామ్నాయంగా ఆయిల్‌పాం సాగు చేయాలన్నారు. 140 కోట్ల జనాభా ఉన్న భారత్‌లో సరిపడా పామాయిల్‌, పప్పు దినుసుల నిల్వలు లేక ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నామని చెప్పారు. ఆయిల్‌పాం సాగుచేస్తే 30 ఏళ్ల పాటు దిగుబడి పొందవచ్చని కోరారు. కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి మాట్లాడుతూ.. ప్రతి రైతు ఉత్పత్తిదారుల సంస్థ (ఫార్మర్‌ ప్రొడ్యూసర్‌ ఆర్గనైజేషన్‌)లో సభ్యత్వం తీసుకోవాలని, సభ్యత్వం ఉంటేనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే అనేక పథకాలకు అర్హత సాధిస్తారని వెల్లడించారు. ఆయిల్‌పాం సాగుకు ఆసక్తి చూపుతున్న రైతులను ప్రత్యేక బస్సులో సాగు చేస్తున్న రైతుల వద్దకు తీసుకెళ్లి అవగాహన కల్పిస్తామని చెప్పారు. కార్యక్రమంలో రైతు కమిషన్‌ సభ్యురాలు భవానిరెడ్డి, ప్రత్యేక నోడల్‌ అధికారి ప్రసాదరావు, వ్యవసాయశాఖ మాజీ జాయింట్‌ డైరెక్టర్‌ కృపాకర్‌రెడ్డి, కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త రాజేందర్‌రెడ్డి, వీణా, జిల్లా ఉద్యాన అధికారి విజయభాస్కర్‌, మార్కెటింగ్‌ అధికారి స్వరణ్‌సింగ్‌, తహసీల్దార్‌ రమేశ్‌రెడ్డి, పుర కమిషనర్‌ వెంకటేశ్వర్లు, రైతులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement