వనపర్తిటౌన్: ప్రధానమంత్రి మోదీ హయంలోనే దేశం వేగంగా అభివృద్ధి చెందుతుందని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ మల్కా కొమరయ్య అన్నారు. బుధవారం జిల్లాకేంద్రంలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు డి.నారాయణ అధ్యక్షతన జరిగిన సన్నాహక, విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా రూ.8 వేల కోట్లు వెచ్చించి నిర్మించిన అనేక ప్రాజెక్టులు జాతికి అంకితం చేసేందుకు ఈ నెల 10న ప్రధానమంత్రి మోదీ రాష్ట్రానికి వస్తున్నారని తెలిపారు. హైదరాబాద్‌లోని పరేడ్ మైదానంలో నిర్వహించే బహిరంగ సభకు బూత్ కమిటీ సభ్యులు, మండల నాయకులు, జిల్లా, రాష్ట్ర నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధికసంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన మోదీ దేశాన్ని, అన్ని రాష్ట్రాలను అభివృద్ధి పథంలో నడిపించేందుకు శక్తివంచన లేకుండా పని చేస్తున్నారని పేర్కొన్నారు. పశ్చిమ బెంగాళ్, కేరళ, తమిళనాడు, అస్సాం, పుదుచ్చేరిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో పుదుచ్చేరి 2వ పర్యాయం, అస్సాం హ్యాట్రిక్ విజయం, పశ్చిమబెంగాల్‌లో బీజేపీ విజయం సాధించిందని.. అదే ఉత్సాహంతో భవిష్యత్‌లో రాష్ట్రంలో సైతం డబుల్ ఇంజన్ సర్కార్‌గా మార్చేందుకు అడుగుపడనున్నారని చెప్పారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి కరణం పరిణిత, జిల్లా ఇన్‌చార్జ్ బొక్క బాల్‌రెడ్డి, రాష్ట్ర నాయకులు అయ్యగారి ప్రభాకర్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, జెడ్పీ మాజీ చైర్మన్ ఆర్.లోకనాథ్‌రెడ్డి, రాష్ట్ర కార్యవర్గసభ్యుడు పురుషోత్తంరెడ్డి, వెంకటేశ్వర్‌రెడ్డి, కేతూరి బుడ్డన్న, జిల్లా ప్రధాన కార్యదర్శులు పెద్దిరాజు, శ్రీనివాస్‌గౌడ్, వారణాసి కల్పన, కౌన్సిలర్ విజయసాగర్ తదితరులు పాల్గొన్నారు.
● ఉపాధ్యాయ ఎమ్మెల్సీ
మల్కా కొమరయ్య


