చిరు వ్యాపారులకు ఊరట | - | Sakshi
Sakshi News home page

చిరు వ్యాపారులకు ఊరట

May 5 2026 9:25 AM | Updated on May 5 2026 9:25 AM

వనపర్తిటౌన్‌: స్థానిక పుర పాలకవర్గం తైబజార్‌ వ్యవస్థను రద్దు చేసి చిరు వ్యాపారులకు భారీ ఊరట కల్పించింది. ఈ నెల 2న జిల్లాకేంద్రంలోని పుర కార్యాలయంలో జరిగిన పాలకవర్గ సాధారణ సమావేశంలో ఎమ్మెల్యే మేఘారెడ్డి చొరవతో కౌన్సిలర్లు ఏకగ్రీవంగా ఆమోదించారు. దీంతో రహదా రులకు ఇరువైపులా, తోపుడు బండ్లపై వ్యాపారం చేసుకునే వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

● గతంలో చిరు వ్యాపారులందరూ రోజువారీగా తైబజార్‌ పేరిట నిర్దేశిత రుసుం టెండర్‌ దక్కించుకున్న కాంట్రాక్టర్‌కు చెల్లించే వారు. రోజు రూ.100 నుంచి రూ.2 వేల వరకు సంపాదించే ఆయా వ్యాపారాలు ప్రాధాన్యతను బట్టి రూ.10 నుంచి రూ.50 వరకు చెల్లించేవారు. కొందరు సరిగా వ్యాపారం నడవకపోయినా, అరకొరగా సాగినా డబ్బులు మాత్రం తప్పనిసరిగా చెల్లించేవారు. 18 నెలల కిందటే కాంట్రాక్టర్‌ గడువు ముగియడంతో పుర సిబ్బందే వసూలు చేస్తున్నారు. సేకరించిన నిధులతో పాటు గతంలో పెండింగ్‌లో ఉన్న తైబజార్‌ వేలం పాట డబ్బుల గోల్‌మాల్‌పై పాలకవర్గ సభ్యులు అధికారుల తీరును తప్పుబడుతూ కౌన్సిల్‌ సమావేశంలో అంశాన్ని లేవనెత్తడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. దీంతో ఈ నెల 2న జరిగిన సమావేశంలో తైబజార్‌ను రద్దు చేస్తున్నట్లు తీర్మానించడంతో చిరు వ్యాపారులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు.

పురపాలికలో 300 మంది..

పట్టణ పరిధిలో 300 మంది వరకు చిరు వ్యాపారులు తైబజార్‌ చెల్లించే వారని అధికార యంత్రాంగం చెబుతోంది. ఆదివారం సంత రోజుతో పాటు పండుగలు, ప్రత్యేక రోజుల్లో ఈ సంఖ్య వెయ్యి వరకు చేరుకుంటుందని అంచనా. పాలకవర్గ నిర్ణయంతో స్థానిక వ్యాపారులకేగాకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చి వ్యాపారాలు చేసుకునే వారికి సైతం మేలు చేకూరుతుంది. తైబజార్‌ వేలం ద్వారా పురపాలికకు ఏటా సుమారు రూ.18 లక్షల నుంచి రూ.26 లక్షల వరకు ఆదాయం సమకూరేది. ఆ ఆదాయాన్ని పురపాలిక కోల్పోయినట్లు అయింది.

వాహన పన్నుపై స్పష్టత కరువు..

పట్టణంలోకి వచ్చే వివిధ వ్యాపార, సేవా, వాణిజ్య ప్రకటనల వాహనాలు, పార్సిల్‌, ట్రాన్స్‌పోర్ట్‌ వాహనాలకు ఎలాంటి మినహాయింపు లేదని.. పన్ను వసూలు చేయాలని కౌన్సిల్‌లో నిర్ణయించారు. కౌన్సిల్‌ సమావేశం జరిగిన నాటి నుంచి ఇప్పటి వరకు పన్ను వసూళ్లపై అధికారులు శ్రద్ధ చూపడం లేదు. ఏయే వాహనానికి ఎంత వసూలు చేయాలనే దానిపై నేటికీ విధివిధానాలను అధికార యంత్రాంగం ఖరారు చేయకపోవడంతో పురపాలికకు వచ్చే అరకొర ఆదాయం కూడా రాకుండా పోతోంది.

వనపర్తి పురపాలికలో తైబజార్‌ రద్దు

వాహనాల పన్ను వసూళ్లపై స్పష్టత కరువు

ఈ నెల 2న కౌన్సిల్‌లో తీర్మానించిన సభ్యులు

కష్టాలు చూడలేకే..

చిరు వ్యాపారుల కష్టాలు చూడలేకే ఎమ్మెల్యే మేఘారెడ్డి చొరవ, కౌన్సిల్‌ సభ్యుల అంగీకారంతో తైబజార్‌ రద్దు చేశాం. మేము తీసుకున్న నిర్ణయం వనపర్తి చరిత్రలో చారిత్రాత్మకం. చిరు వ్యాపారి రోజు రూ.10 నుంచి రూ.50 వరకు తైబజార్‌ చెల్లించేవారు. మా నిర్ణయంతో ప్రతి నెల రూ.300 నుంచి రూ.1,500 వరకు ఆదా చేయడం మా చిత్తశుద్ధికి నిదర్శనం.

– ఎం.మాధవి, చైర్‌పర్సన్‌, వనపర్తి పురపాలిక

Advertisement
 
Advertisement
Advertisement