వనపర్తి: యాసంగి సీజన్‌కు సంబంధించిన వరి కొనుగోళ్ల ప్రక్రియలో వేగం పెంచాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో వ్యవసాయ, పౌరసరఫరాలు, రవాణాశాఖ అధికారులు, ఏపీఎంలతో ధాన్యం కొనుగోళ్లపై సమీక్ష నిర్వహించారు. జిల్లాలో గతేడాది యాసంగిలో ఈ సమయం వరకు 60 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తే.. ఈ ఏడాది ఇప్పటి వరకు కేవలం 10 వేల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసినట్లు చెప్పారు. ఆత్మకూర్, అమరచింత, మదనాపురం, కొత్తకోట మండలాల్లో కోతలు ప్రారంభమై ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చాయని, ఎందుకు ఆలస్యమవుతోందని ఏపీఎంల వారీగా అడిగి తెలుసుకున్నారు. లారీలు కేంద్రాలకు రావడం లేదని ఏపీఎంలు తెలుపగా.. అక్కడే ఉన్న రవాణా కాంట్రాక్టర్ వెంకటస్వామిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 40 వాహనాలు సమకూరుస్తామని అగ్రిమెంట్ చేసుకున్నారని.. ఎక్కడున్నాయని ప్రశ్నించారు. 20 వాహనాలు ఉన్నాయని.. మిగిలినవి వెంటనే పంపిస్తానని చెప్పగా మొత్తం వాహనాలు క్షేత్రస్థాయిలో కనిపించకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. అకాల వర్షాలు కురిసే ప్రమాదం ఉన్నందున ప్రభుత్వ నిబంధనల ప్రకారం తేమ శాతం వచ్చిన వెంటనే తూకం చేసి మిల్లుకు తరలించాలన్నారు. ధాన్యం లారీల్లో చేర్చిన వెంటనే ట్రక్‌షీట్ తీసుకొని ట్యాబ్ ఎంట్రీ పూర్తి చేయాలని, ఎప్పటికప్పుడు డబ్బులు రైతుల ఖాతాల్లో జమయ్యేలా చూడాలని కోరారు. వర్షాలు పడితే ధాన్యం తడిసిపోకుండా అవసరమైన మేరకు టార్పాలిన్లు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ధాన్యం తడిసిందనే వార్త రాకూడదని సూచించారు. సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ వినోద్‌కుమార్, పౌరసరఫరాలశాఖ అధికారి కాశీవిశ్వనాథ్, వ్యవసాయ అధికారి ఆంజనేయులు, డీటీఓ మానస, డీసీఓ బి.రాణి, మార్కెటింగ్ అధికారి స్వ రణ్‌సింగ్, పౌరసరఫరాల సంస్థ డీఎం, పీఏసీఎస్ సీఈఓలు, ఏపీఎంలు తదితరులు పాల్గొన్నారు.
మరో ఐదురోజులే గడువు..
జనగణన–2027లో భాగంగా ఏప్రిల్ 26 నుంచి మే నెల 10వ తేదీ వరకు స్వీయ జనగణన (సెల్ఫ్ ఎన్యూమరేషన్) కొనసాగుతుందని.. జిల్లాలోని అన్ని కుటుంబాలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి కోరారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో సెల్ఫ్ ఎన్యూమరేషన్ ప్రక్రియపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలోని ప్రభుత్వ ఉద్యోగులు, సిబ్బంది, పోలీస్‌శాఖ, స్వయం సహాయక సంఘాల సభ్యులు, మీడియా ప్రతినిధులు, రాజకీయ ప్రతినిధులు, ప్రతి కుటుంబం నుంచి కుటుంబ యజమాని ఆన్‌లైన్‌లో స్వీయ జనగణన చేసుకోవాలన్నారు. స్మార్ట్‌ఫోన్‌లో చాలా సులువుగా ఫారం నింపవచ్చని, కేవలం 5 నిమిషాల్లో పూర్తవుతుందని చెప్పారు. httpr://re.cenrur.gov.in లో లాగిన్ కావాలని.. పూర్తయిన తర్వాత వచ్చిన గుర్తింపు సంఖ్యను మే నెల 11 నుంచి ఇంటికి వచ్చే ఎన్యూమరేటర్‌కు చూపించాల్సి ఉంటుందని తెలిపారు. తుది గడువు మరో 5 రోజులు మాత్రమే మిగిలి ఉందని.. జిల్లాలోని అందరు కుటుంబ యజమానులు స్వీయ జనగణన పూర్తి చేసుకొని గుర్తింపు సంఖ్య పొందాలన్నారు. కార్యక్రమంలో జనగణన జాయింట్ డైరెక్టర్ బి.లాజర్, జిల్లా సెన్సెస్ నోడల్ అధికారి సుల్తాన్ అలీ, సీపీఓ హరికృష్ణ, డీపీఓ రఘునాథ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ ఆదర్శ్ సురభి


