క్షయ గుర్తింపునకుప్రత్యేక శిబిరాలు | - | Sakshi
Sakshi News home page

క్షయ గుర్తింపునకుప్రత్యేక శిబిరాలు

May 5 2026 9:25 AM | Updated on May 5 2026 9:25 AM

పాన్‌గల్‌: క్షయ నిర్మూలనే లక్ష్యంగా ప్రభుత్వం 100 రోజుల ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహిస్తూ వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తోందని జిల్లా టీబీ నోడల్‌ అధికారి డా. వంశీకృష్ణ అన్నారు. సోమవారం మండల కేంద్రంలో నిర్వహించిన క్షయ నిర్ధారణ ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఆయన సందర్శించి సిబ్బందితో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రధానమంత్రి టీబీ ముక్త్‌భారత్‌ అభియాన్‌లో భాగంగా చేపట్టిన ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకునేలా సిబ్బంది గ్రామాల్లో అవగాహన కల్పించాలన్నారు. శిబిరాల్లో వ్యాధిగ్రస్తులను ముందుగానే గుర్తించి చికిత్స అందించడంపై దృష్టి సారిస్తారని తెలిపారు. క్షయ మరణాలు తగ్గించి సురక్షిత సమాజాన్ని నిర్మించడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. వ్యాధిగ్రస్తులు క్రమం తప్పకుండా మందులు వాడితే రోగం నయమవుతుందన్నారు. టీబీ రహిత గ్రామంగా తీర్చిదిద్దేందుకు గ్రామస్తులందరూ సహకరించాలని సూచించారు. సమావేశంలో సర్పంచ్‌ నాగలక్ష్మి, జిల్లా టీబీ వ్యాఽధి నిర్ధారణ సిబ్బంది నాగేష్‌, వినోద్‌, మధు, స్థానిక వైద్యసిబ్బంది రాంచందర్‌, మదన్‌గోపాల్‌, నాగేశ్వరి, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

పంటమార్పిడిపై దృష్టి సారించాలి

గోపాల్‌పేట: రైతులు పంటమార్పిడిపై దృష్టి సారించి మార్కెట్‌లో డిమాండ్‌ ఉన్న పంటలు సాగుచేస్తే అధిక దిగుబడులు పొందడంతో పాటు లాభాలు గడించే అవకాశం ఉందని పాలెం వ్యవసాయ కళాశాల ప్రొఫెసర్‌ డా. కవిత తెలిపారు. సోమవారం మండలంలోని మున్ననూరు, గోపాల్‌పేట, ఏదుట్ల, బుద్దారం గ్రామాల్లోని రైతువేదికల్లో నిర్వహించిన రైతు అవగాహన కార్యక్రమాల్లో ఆమె పాల్గొన్నారు. బుద్దారంలో వ్యవసాయ శాస్త్రవేత్తలు రాంప్రకాశ్‌, దివ్య, చైతన్య పంటల సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అధిక దిగుబడులపై అవగాహన కల్పించారు. భూసార పరీక్షలు చేయించి ఫలితాల ఆధారంగా నేలకు అనుకూలమైన పంటలు సాగు చేయాలని సూచించారు. సేంద్రియ వ్యవసాయం ప్రాముఖ్యతను వివరించారు. యూరియా వినియోగాన్ని తగ్గించడం, వ్యవసాయ అధికారుల సూచనల మేరకు నేల సారాన్ని పెంచేందుకు పప్పుదినుసుల పంటలకు మారడం వంటి వాటి గురించి తెలియజేశారు. ఏదులలో మండల వ్యవసాయ అధికారి రమేష్‌ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించగా.. భూమిని సంరక్షించడం, ఆరుతడి పంటల సాగు, జీలుగ, పిల్లి పెసర, పచ్చిరొట్ట సాగు, సేంద్రియ ఎరువుల వాడకంపై అవగాహన కల్పించారు. అనంతరం భూసార పరీక్ష ఫలితాల కార్డులను రైతులకు అందించారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల రైతులు, వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement