వనపర్తి: జిల్లా అదనపు పోలీస్ సూపరింటెండెంట్ (అడ్మిన్)గా బాధ్యతలు స్వీకరించిన రాజేష్ మీనా సోమవారం కలెక్టరేట్‌లో కలెక్టర్ ఆదర్శ సురభిని మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్క అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఏఎస్పీ (అడ్మిన్)గా బాధ్యతలు స్వీకరించడం సంతోషకరమని, జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణలో కీలక పాత్ర పోషించాలన్నారు. మహిళల భద్రత, బాలల సంరక్షణ, సైబర్ నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.
ఎస్పీ ప్రజావాణికి 7 వినతులు..
జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి ఏడు వినతులు వచ్చాయి. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు నేరుగా అదనపు ఎస్పీ రాజేష్ మీనాను కలిసి సమస్యలు వివరించి వినతులు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రజల సమస్యలకు పరిష్కారం చూపడం పోలీసుశాఖ బాధ్యతని, ప్రజావాణి సమస్యలను నిర్భయంగా తెలియజేసే వేదికగా నిలుస్తోందన్నారు. వచ్చిన ప్రతి ఫిర్యాదును నిశితంగా పరిశీలించి సంబంధిత అధికారులతో మాట్లాడి వేగంగా పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రజలు పోలీసుశాఖపై విశ్వాసం ఉంచి ప్రజావాణిని సద్వినియోగం చేసుకోవాలన్నారు.


