గత పాలకులు అభివృద్ధిని మరిచారు
● రాష్ట్ర పశుసంవర్దకశాఖ మంత్రి
వాకిటి శ్రీహరి
● రూ.15 కోట్ల అభివృద్ధి
పనులకు భూమిపూజ
ఆత్మకూర్: నియోజకవర్గంలో ఎవరూ ఊహించని రీతిలో అభివృద్ధి పనులు కొనసాగుతుంటే గత పాలకులు తట్టుకోలేకపోతున్నారని రాష్ట్ర పశుసంవర్దకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. గురువారం రాత్రి పుర పరిధిలోని పలు వార్డుల్లో రూ.15 కోట్లతో నిర్మించే సీసీ రహదారులు, డ్రైనేజీలు తదితర అభివృద్ధి పనులకు భూమిపూజ చేసి మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుదారులను 90 శాతం గెలిపించి తన ఉత్సాహాన్ని రెట్టింపు చేశారని, ఇదే ఉత్సాహాన్ని పుర ఎన్నికల్లో చూపాలని కోరారు. అడిగిన వెంటనే నిధులిచ్చే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఉన్నారని.. పురపాలికకు రూ.15 కోట్లు, మండలానికి రూ.250 కోట్లు మంజూరయ్యాయని, రానున్న మూడేళ్లలో మరో రూ.300 కోట్లు తెచ్చి అభివృద్ధిని పరుగులు పెట్టిస్తానని హామీ ఇచ్చారు.
త్వరలోనే జాతీయ రహదారి..
జూరాల గ్రామం వద్ద రూ.123 కోట్లతో హైలెవల్ వంతెన పనులు కొనసాగుతున్నాయని.. దీని అనుసంధానంగా మంత్రాలయం, ఎమ్మిగనూర్ నాలుగు వరుసల జాతీయ రహదారి నిర్మాణానికి గ్రీన్‌సిగ్నల్ వచ్చిందని మంత్రి వాకిటి వెల్లడించారు. త్వరలోనే రెవెన్యూ డివిజన్ ప్రకటన రాబోతుందని, సీఎం నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలతో పాటు గత పాలకుల చేతగానితనం, వైఫల్యాలను గడపగడపకు వివరించాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. రూ.23 కోట్లతో 50 పడకల ప్రభుత్వ ఆస్పత్రి, రూ.15 కోట్లతో సీసీ రహదారులు, రూ.5 కోట్లతో ఇండోర్ స్టేడియం, మార్కెట్‌యార్డు భవనం, షాపింగ్ కాంప్లెక్స్, చెరువుకట్ట అభివృద్ధి ఇలా ఎన్నో పనులు చేపట్టబోతున్నట్లు ప్రకటించారు. కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రహ్మతుల్లా, నాయకులు పరమేష్, తులసీరాజ్, నల్గొండ శ్రీను, గంగాధర్‌గౌడ్, భాస్కర్, అనీల్‌గౌడ్, సుదర్శన్‌శెట్టి, షబ్బీర్, ఖలీం, రవికాంత్, రవీందర్, నాగేష్, దామోదర్, గంగ, సాయిరాఘవ, మహేష్, షాలాం, జుబేర్, కరణ్‌లాల్ తదితరులు పాల్గొన్నారు.


