చింతలకుంట.. భక్తులతో కిటకిట
● మూడురోజుల పాటు ఘనంగా
సాగిన ఉత్సవాలు
● కోళ్లు, పొట్టేళ్లు బలిచ్చి ప్రత్యేక పూజలు
● బందోబస్తు నిర్వహించిన పోలీసులు
వనపర్తి రూరల్: పెబ్బేరు మండలం పాతపల్లి శివారు చింతలకుంట ఆంజనేయస్వామి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. సంక్రాంతి రోజుల్లో మూడు రోజుల పాటు ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. వేలాది మంది భక్తులు తరలివచ్చి ప్రత్యేక పూజలు చేసి ఎక్కడా లేని విధంగా స్వామి వారికి కోళ్లు, పొట్టేళ్లు బలిచ్చి మొక్కులు తీర్చుకున్నారు. అన్నం, మాంసం ముక్కలు, రొట్టెలు, పులుసు, కల్లు సీసా, గుగ్గిళ్లు సమర్పించారు. ఉత్సవాల సందర్భంగా ఆలయం భక్తులతో కిటకిటలాడింది. ఈ సందర్భంగా పలువురు భక్తులు కొనుగోలు చేసిన వాహనాలకు ప్రత్యేక పూజలు చేయించారు. ఎలాంటి అవాంచనీయ ఘటనలు, ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా పెబ్బేరు పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించడంతో పాటు భక్తుల రద్దీని నియంత్రించేందుకు బారికేట్లు ఏర్పాటు చేశారు. ఆలయ పూజారి నంబి వెంకటేశ్వర్లు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.


