పుర ఎన్నికల్లో పోటీకి సిద్ధం
● ప్రజా పోరాటాలే లక్ష్యం
● సీపీఎం రాష్ట్ర కార్యదర్శి
జాన్‌వెస్లీ
అమరచింత: ప్రజల పక్షాన నిలబడి వారి సమస్యల పరిష్కారానికి నిరంతరం శ్రమిస్తున్న పార్టీ సీపీఎం అని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ అన్నారు. ఆదివారం పట్టణంలోని జీఎస్ భవన్‌లో జరిగిన పార్టీ మండల నాయకుల సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై త్వరలో జరిగే పుర ఎన్నికల సన్నద్ధతపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా సీపీఎం అభ్యర్థులు తమ బలం ఉన్న చోట పోటీచేస్తే ప్రజలు ఆదరించి గెలిపించడం సంతోషకరమన్నారు. రాబోయే పుర ఎన్నికల్లో సైతం పార్టీ అభ్యర్థులు పోటీలో ఉంటారని.. ప్రజలు ఆదరించి గెలిపించాలని కోరారు. దేశం, రాష్ట్రంలో మతోన్మాదాన్ని పెంచి పోషించే రాజకీయ పార్టీలను ఓడించడమే తమ ధ్యేయ్యమని.. తమతో కలిసివచ్చే పార్టీలతో ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు వెల్లడించారు. పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేయాలని మూడేళ్ల కిందట పార్టీ గుడిసెల పోరుకు శ్రీకారం చుట్టి పేదల పక్షాన నిలిచిందని.. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్‌పార్టీ వారి సమస్యలను విస్మరించిందని ఆరోపించారు. పట్టణ పేదల ఇళ్ల స్థలాల విషయంలో మాట ఇచ్చిన మంత్రి వాకిటి శ్రీహరి నేటికీ నెరవేర్చకపోవడం దారుణమన్నారు. గతంలో జరిగిన పుర ఎన్నికల్లో సీపీఎం పోటీచేసి వైస్ చైర్మన్ పదవి కై వసం చేసుకుందని.. ప్రస్తుతం పేదల సమస్యలు తీరాలంటే పార్టీ అభ్యర్థులను పూర్తిస్థాయిలో గెలిపించి చైర్మన్ స్థానం ఇవ్వాలని పట్టణ ప్రజలను కోరారు. పూటకో పార్టీ, కండువాలు మార్చే వారికి ఈ ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్పాలన్నారు. సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు ఎండీ జబ్బార్, ఎండీ మహమూద్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ జీఎస్ గోపి, వెంకటేష్, అజయ్, రాజు, రాఘవేంద్ర, శ్యాంసుందర్ తదితరులు పాల్గొన్నారు.


