పేదల అభ్యున్నతే ప్రభుత్వ ధ్యేయం
వనపర్తిటౌన్: పేదల అభ్యున్నతే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డా. చిన్నారెడ్డి అన్నారు. ఆదివారం తన నివాసంలో 86 మంది లబ్ధిదారులకు రూ.21.45 లక్షల సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను అందజేసి మాట్లాడారు. బీఆర్‌ఎస్ పార్టీ పాలనలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దెబ్బతిందని.. నేడు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క క్రమశిక్షణతో గాడిలో పెడుతున్నారని వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రికార్డుస్థాయిలో సీఎం రిలీఫ్‌ఫండ్ అందిస్తుందని తెలిపారు. ఆరోగ్యశ్రీ ద్వారా పేదలకు ఉచితంగా కార్పొరేట్ వైద్యం కాంగ్రెస్ హయంలోనే అమలైందని గుర్తుచేశారు. కార్యక్రమంలో టీపీీసీసీ ప్రధానకార్యదర్శి నందిమళ్ల యాదయ్య, డీసీసీ మాజీ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్, ఏఐపీసీ అధ్యక్షుడు నాగార్జున, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ఎస్‌జీటీయూ డైరీ ఆవిష్కరణ..
సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర 2026 డైరీని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డా. చిన్నారెడ్డి ఆదివారం జిల్లాకేంద్రంలోని తన నివాసంలో ఆవిష్కరించారు. టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని ఎస్‌జీటీయూ జిల్లాశాఖ వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి జి.నరేందర్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు రామ్మూర్తి, జిల్లా ప్రధానకార్యదర్శి భాస్కర్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.


