పేదల సంక్షేమానికి ప్రభుత్వం కృషి : ఎమ్మెల్యే
మదనాపురం: పేద ప్రజల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని ఎమ్మెల్యే జి.మధుసూదన్‌రెడ్డి అన్నారు. బుధవారం మండల కేంద్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన 3వ నంబర్ రేషన్ దుకాణాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. అర్హులందరికి రేషన్ కార్డులు, పింఛన్లు, ఇతర సంక్షేమ ఫలాలు అందించేందుకు అధికారులు కృషి చేయాలని సూచించారు. కొత్త రేషన్ దుకాణం ఏర్పాటుతో నిత్యావసర సరుకుల పంపిణీ మరింత సులభతరం అవుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ శారద, మార్కెట్ ఛైర్మన్ పల్లెపాగ ప్రశాంత్, తహసీల్దార్ మోహన్, ఎంపీడీఓ ప్రసన్నకుమారి, వైస్ చైర్మన్ తిరుపతిరెడ్డి, నాయకులు రాంచంద్రయ్య, డీలర్ రాజశేఖర్, టీసీ నాగన్నయాదవ్, వెంకట్‌నారాయణ, ఆయా గ్రామాల కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
రామన్‌పాడులో 1,020 అడుగుల నీటిమట్టం
మదనాపురం: మండలంలోని రామన్‌పాడు జలాశయంలో బుధవారం పూర్తిస్థాయి నీటిమట్టం 1,021 అడుగులకుగాను 1,020 అడుగులు ఉన్నట్లు ఏఈ వరప్రసాద్ తెలిపారు. జూరాల ఎడమ కాల్వ నుంచి 730 క్యూసెక్కుల వరద జలాశయానికి చేరుతుండగా.. సమాంతర కాల్వలో సరఫరా లేదని వివరించారు. ఇదిలా ఉండగా.. జలాశయం నుంచి ఎన్టీఆర్ కాల్వకు 875 క్యూసెక్కులు, కుడి, ఎడమ కాల్వలకు 15 క్యూసెక్కులు, వివిధ ఎత్తిపోతల పథకాలకు 872 క్యూసెక్కులు, తాగునీటి అవసరాలకు 20 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నామని చెప్పారు.
‘లేబర్ కోడ్లతో
కార్మికులకు అన్యాయం’
వనపర్తి రూరల్: కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా 44 కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్లుగా విభజించి కార్మికులకు అన్యాయం చేసిందని ఏఐటీయూసీ రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి నర్సింహ ఆరోపించారు. బుధవారం జిల్లాకేంద్రంలోని సంఘం కార్యాలయంలో నిర్వహించిన జిల్లా కార్యవర్గ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. లేబర్ కోడ్లలో 3 కార్మికులకు వ్యతిరేకంగా ఉన్నాయని.. బీజేపీ అనుబంధ కార్మిక సంఘం బీఎంఎస్ కూడా అదే చెప్పిందన్నారు. వీటి ఫలితంగా సంఘం ఏర్పాటు, సమ్మె, వేతనాల పెంపునకు పోరాడే హక్కులు కోల్పోతామని వివరించారు. రోజకు 8 గంటల పనిదినం ఉండగా.. 12 గంటలకు పెంచిందన్నారు. కార్మికుల శ్రమను పారిశ్రామికవేత్తలకు దోచిపెట్టేందుకు కోడ్లు తీసుకొచ్చారని.. కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని సుప్రీంకోర్టు తీర్పును పాలకులు అమలు చేయడం లేదని వివరించారు. కనీస వేతనం, కార్మికుల హక్కుల కోసం సంఘం రాష్ట్రంలో అలుపెరగని పోరాటం కొనసాగిస్తుందన్నారు. శ్రీహరి, శ్రీరాం, మోషా, భాస్కర్ పాల్గొన్నారు.
పేదల సంక్షేమానికి ప్రభుత్వం కృషి : ఎమ్మెల్యే


