నిబంధనల మేరకే ధాన్యం కొనుగోళ్లు
వనపర్తి: జిల్లాలో వానాకాలం వరి ధాన్యం కొనుగోళ్లు చివరి దశకు చేరుకున్నాయని.. ఇప్పటికే కొనుగోళ్లు పూర్తయిన కేంద్రాలు మూసివేసి ధ్యానం వచ్చే చోట ప్రభుత్వ నిబంధనల ప్రకారం సేకరణ ప్రక్రియ కొనసాగించాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ ఎన్.ఖీమ్యానాయక్ తెలిపారు. బుధవారం వరి ధాన్యం కొనుగోళ్లపై రాష్ట్ర పౌరసరఫరాలశాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా.. కలెక్టరేట్ నుంచి అదనపు కలెక్టర్లు, పౌరసరఫరాలశాఖ అధికారులు పాల్గొని వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా పౌరసరఫరాల కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర మాట్లాడుతూ.. బంగ్లాదేశ్‌తో సమస్యలు ఉత్పన్నమైనందున జనపనార దిగుమతి తగ్గి గన్నీబ్యాగుల ఉత్పత్తిపై ప్రభావం పడే అవకాశం ఉందన్నారు.
యాసంగి సీజన్‌లో సమస్యలు రాకుండా కొనుగోలు కేంద్రాలు, రైస్‌మిల్లుల నుంచి తిరిగి తీసుకొని గోదాముల్లో భద్రపర్చాలని ఆదేశించారు. సీఎంఆర్ అప్పగించని మిల్లులపై ఒత్తిడి పెంచి త్వరగా అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ధాన్యం విక్రయించిన రైతులకు సకాలంలో డబ్బులు వారి ఖాతాలో జమ చేసేలా చూడాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి కాశీవిశ్వనాథ్, జిల్లా పౌరసరఫరాలసంస్థ డీఎం జగన్మోహన్, కో–ఆపరేటివ్ అధికారి బి.రాణి, జిల్లా ఇన్‌చార్జ్ వ్యవసాయ అధికారి దామోదర్ తదితరులు పాల్గొన్నారు.


