‘భూములు కబ్జా చేస్తుంటే చూస్తూ ఊరుకోం’
కొత్తకోట: రాజకీయాలు, ఆర్థిక పలుకుబడిని ఉపయోగించుకొని ఇతరుల భూములు, ప్రభుత్వ స్థలాలు అడ్డగోలుగా కబ్జా చేస్తుంటే బీసీ పొలిటికల్ జేఏసీ చూస్తూ ఊరుకోదని సంఘం రాష్ట్ర చైర్మన్ డా. రాచాల యుగంధర్‌గౌడ్ హెచ్చరించారు. బుధవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ వెంకటేశ్వర్లును కలిసి కబ్జాకు గురైన భూములపై విచారణ జరపాలని ఫిర్యాదు అందజేసిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. పుర పరిధిలోని కుమ్మరికుంటను పరిశీలించడానికి వెళ్తుండగా.. కొన్ని ఆసక్తికర నిజాలు వెలుగు చూశాయన్నారు. సర్వేనంబర్ 295, 296, 297, 302లోని 4 ఎకరాల భూమి 2009–10 వరకు హాజీ భద్రోద్దీన్ అనే వ్యక్తి పేరుపై ఉండగా.. 2010–11లో ఎలాంటి ఆధారం లేకుండా ఇతరుల పేరుపై మార్పిడి జరిగిందని, రెవెన్యూ అధికారులకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. అంతేగాకుండా ఈ భూమి పరిసరాల్లో ఉన్న ప్రభుత్వ భూములు, ఇతర పట్టా భూములు కూడా కబ్జాకు గురైనట్లు తెలుస్తోందని, నిగ్గు తేలుస్తామన్నారు. అక్రమాలకు రాజకీయ పలుకుబడి ఉపయోగించారా? లేక అధికారులకు లంచాలు ఎరవేసి మార్పిడి చేసుకున్నారా? అనే వివరాలు బహిర్గతం చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఎమ్మెల్యే, కలెక్టర్ స్పందించి వెంటనే విచారణ జరిపించి అక్రమార్కులు, అందుకు సహకరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రెటరీ, లోకాయుక్తను ఆశ్రయిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో అంజన్న యాదవ్, సయ్యద్ గూడూషా, వీవీ గౌడ్, మహేందర్, బత్తుల జితేందర్, శివ, ధర్మేంద్రసాగర్, రాఘవేందర్‌గౌడ్, రమేష్ పాల్గొన్నారు.


