రోడ్డు భద్రత నియమాలు పాటించాలి
వనపర్తి రూరల్: వాహన చోదకులు విధిగా రోడ్డు భద్రత నియమాలు పాటిస్తూ వాహనాలు నడపాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ న్యాయమూర్తి రజని కోరారు. రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా బుధవారం పెబ్బేరులోని జిల్లా పరిషత్ బాలుర, బాలికల ఉన్నత పాఠశాలలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించగా.. ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. వాహనదారులు రహదారుల పక్కన బోర్డులపై సూచించిన గుర్తులను అనుసరిస్తూ వాహనాలు నడపడంతో ప్రమాదాలను తగ్గించవచ్చని తెలిపారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్, నాలుగు చక్కాల వాహన చోదకులు సీట్‌బెల్ట్ కచ్చితంగా ధరించాలని సూచించారు. మత్తు పదార్థాలకు దూరంగా ఉంటామని, 18 ఏళ్లు నిండిన తర్వాతే వాహనాలు నడుపుతామని విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో జూనియర్ సివిల్ న్యాయమూర్తి అశ్విని, మోటారు వెహికిల్ ఇన్‌స్పెక్టర్ సైదులు, పీపీ రాజేష్, పుష్పలత, హెచ్‌ఎం విష్ణువర్ధన్‌రావు, న్యాయవాదులు బాలనాగయ్య, శిరీష్, చంద్ర, గిరిజ, వాలంటీర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


