దివ్యాంగులు అన్నిరంగాల్లో రాణించాలి | - | Sakshi
Sakshi News home page

దివ్యాంగులు అన్నిరంగాల్లో రాణించాలి

Jan 9 2026 11:12 AM | Updated on Jan 9 2026 11:12 AM

దివ్యాంగులు అన్నిరంగాల్లో రాణించాలి

దివ్యాంగులు అన్నిరంగాల్లో రాణించాలి

21న దివ్యాంగుల ప్రజావాణి

రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డా. జిల్లెల్ల చిన్నారెడ్డి

వనపర్తి: దివ్యాంగుల సమస్యలు పరిష్కరించేందుకుగాను ఈ నెల 21న ప్రత్యేక ప్రజావాణి నిర్వహిస్తున్నామని.. జిల్లాలోని దివ్యాంగులు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డా. జి.చిన్నారెడ్డి తెలిపారు. బుధవారం స్థానిక పాత మార్కెట్‌యార్డు ప్రాంగణంలో జిల్లా సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ఆర్టిఫిషియల్‌ లింబ్స్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా, గ్రిడ్‌ కంట్రోల్‌ ఆఫ్‌ ఇండియా సౌజన్యంతో దివ్యాంగులకు ఉచిత ఉపకరణాల పంపిణీ కార్యక్రమం నిర్వహించగా.. ఆయనతో పాటు ఎమ్మెల్యే మేఘారెడ్డి, కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి, ఆలింకో డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ సంజయ్‌సింగ్‌, గ్రిడ్‌ కార్యనిర్వాహక సంచాలకుడు ఎంకే రమేష్‌ ముఖ్యఅతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లాలోని 730 మంది దివ్యాంగులకు ఉపకరణాలు అందజేసి మాట్లాడారు. దివ్యాంగులు బాగా చదువుకొని సకలాంగులతో సమానంగా ఉన్నత శిఖరాలను అధిరోహించాలని.. అందుకు ప్రభుత్వం తరఫున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు. మిత్రుల్లో ఒకరు దివ్యాంగుడైతే ఇతర స్నేహితుల కంటే దివ్యాంగుడైన స్నేహితుడిపై ఎక్కువ ప్రేమ, ఆప్యాయత చూపాలని సవ్యాంగులకు సూచించారు. కళ్లు లేని వారికి స్పర్శ ద్వారా చదువుకొనే అవకాశం కల్పించిన లూయిస్‌ బ్రెయిలీ, ఉత్తమ పార్లమెంటేరియన్‌ అవార్డు గ్రహీత జైపాల్‌రెడ్డిని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాలని కోరారు. రాష్ట్రస్థాయి ప్రజావాణికి వచ్చే దివ్యాంగుల అర్జీలను మొదటి ప్రాధాన్యతగా పరిష్కరిస్తున్నామని తెలిపారు. దివ్యాంగులను పెళ్లి చేసుకుంటే ప్రభుత్వం రూ.లక్ష ఆర్థిక సాయం అందిస్తుందని వివరించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గతేడాది దివ్యాంగుల దినోత్సవం రోజున సంక్షేమ భవన నిర్మాణానికి వెయ్యి గజాల స్థలం కేటాయించామని.. భవన నిర్మాణానికి త్వరలోనే నిధులు మంజూరు చేయనున్నట్లు చెప్పారు. జిల్లాలోని 728 మంది దివ్యాంగులకు రూ.70.73 లక్షల విలువగల ఉపకరణాలు అందజేస్తున్న యాజమాన్యాలకు ధన్యవాదాలు తెలిపారు.

లక్ష్య సాధనకు వైకల్యం అడ్డుకాదు..

వైకల్యం అనేది శరీరానికి మాత్రమేగాని లక్ష్య సాధనకు కాదని, అన్నిరంగాల్లో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి కోరారు. బ్యాటరీ ట్రై సైకిల్‌ 97, వినికిడి యంత్రాలు 44, చంక కర్రలు 178, అడ్జస్టబుల్‌ వాకింగ్‌ స్టిక్స్‌ 108, ట్రై సైకిల్స్‌ 149, టీఎల్‌ఎం కిట్స్‌ 30 ఉపకరణాలు ఉచితంగా అందిస్తున్నట్లు తెలిపారు. ఆర్టిఫిషియల్‌ లింబ్స్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ సంజయ్‌సింగ్‌ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ సహకారంతో సీఎస్‌ఆర్‌ నిధులతో దివ్యాంగులకు ఉపకరణాలు అందిస్తున్నట్లు చెప్పారు. అలింకో సంస్థ గ్రామస్థాయికి చేరుకొని వారికి అవసరమైన ఉపకరణాలు అందిస్తుందన్నారు. గ్రిడ్‌ కంట్రోల్‌ ఆఫ్‌ ఇండియా కార్యనిర్వాహక సంచాలకుడు రమేష్‌ మాట్లాడుతూ.. జిల్లాలోని దివ్యాంగులకు ఉపకరణాలు అందించే అవకాశం కల్పించినందుకు జిల్లా యంత్రాంగానికి కృతజ్ఞతలు తెలిపారు. జనవరి 4న లూయిస్‌ బ్రెయిలీ జయంతిని పురస్కరించుకొని ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులు, దివ్యాంగురాలైన గాయత్రి చేతుల మీదుగా కేక్‌ కట్‌ చేశారు. మైనార్టీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో 20 మంది మైనార్టీలకు ఒక్కొక్కరికి రూ.30 వేల చెక్కును అందజేశారు. కార్యక్రమంలో ఆర్డీఓ సుబ్రమణ్యం, డీడబ్ల్యూఓ సుధారాణి, వనపర్తి మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పి.శ్రీనివాస్‌గౌడ్‌, జిల్లా మైనార్టీ సంక్షేమశాఖ అధికారి అఫ్జలుద్దీన్‌, తహసీల్దార్‌ రమేష్‌రెడ్డి, దివ్యాంగుల సమాఖ్య జిల్లా అధ్యక్షుడు మీసాల మోహన్‌, దివ్యాంగులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement