వనపర్తి రూరల్: అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్లకు కనీస వేతనం ఇవ్వడంతో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు మండ్ల రాజు, కార్యదర్శి పుట్ట ఆంజనేయులు డిమాండ్ చేశారు. అంగన్‌వాడీల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని సోమవారం అంగన్‌వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు శారద ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని మర్రికుంటలో 48 గంటల సమ్మెను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఐసీడీఎస్ సేవలను పాత పద్ధతిలోనే కొనసాగించాలని, మొబైల్ అంగన్‌వాడీ సెంటర్లను రద్దు చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన విద్యావిధానం చట్టాన్ని అమలుచేసే ప్రయత్నాన్ని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలన్నారు. సుప్రీంకోర్టు తీర్పు మేరకు అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్లకు గ్రాడ్యూటీ అమలు చేయడంతో పాటు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రూ. 18వేల వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. పీఎఫ్, ఈఎస్‌ఐ సౌకర్యం కల్పించాలన్నారు. 10 నెలలుగా పెండింగ్‌లో ఉన్న వేతనాలను వెంటనే చెల్లించాలన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు బొబ్బిలి నిక్సన్, పీఎన్ రమేశ్, కవిత, రమాదేవి, జ్యోతి, నాగేంద్రమ్మ, సంధ్యారాణి, విజయమ్మ, గోవిందమ్మ, సుగుణబాయి, రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.