పుర వార్డుల వారీగా రిజర్వేషన్లు ఖరారు
● వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల
సమక్షంలో లక్కీడిప్ తీసిన కలెక్టర్
వనపర్తి టౌన్: పుర ఎన్నికలకు సంబంధించి వార్డుల వారీగా రిజర్వేషన్లు ఖరారయ్యాయి. శనివారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో కలెక్టర్ ఆదర్శ్ సురభి జిల్లాలోని 5 పురపాలికలకు చెందిన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో లక్కీడిప్ తీసి రిజర్వేషన్లు ప్రకటించారు. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను వార్డుల్లోని కుల జనాభా ఆధారంగా ఎంపిక చేసినట్లు కలెక్టర్ చెప్పారు. సీప్–2024 సర్వే ప్రాతిపదికన వార్డుల వారీగా రిజర్వేషన్లను పారదర్శకంగా నిర్వహించినట్లు తెలిపారు. అనంతరం గెజిట్ విడుదల చేసి జాబితాను కలెక్టరేట్, ఆయా పుర కార్యాలయాల్లోని నోటీసు బోర్డులపై ప్రదర్శిస్తామన్నారు. వార్డుల వారీగా రిజర్వేషన్ ఖరారు చేసే సమయంలో వివరాలను ఎల్‌ఈడీ స్క్రీన్‌పై ప్రదర్శించారు. జనాభా తక్కువగా ఉన్నచోట రిజర్వ్డు స్థానాలు ఎలా కేటాయిస్తారని పలువురు అడగగా.. పీఆర్ చట్టం, మున్సిపల్ చట్టం వేర్వేరని, పుర చట్టానికి లోబడి ప్రక్రియ కొనసాగుతుందని వెల్లడించారు. కార్యక్రమంలో ఆర్డీఓ సుబ్రమణ్యం, వనపర్తి పుర కమిషనర్ వెంకటేశ్వర్లు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఎన్నికల విభాగం అధికారులు తదితరులు పాల్గొన్నారు.


