రామన్‌పాడుకు నీటి సరఫరా నిలిపివేత
మదనాపురం: మండలంలోని రామన్‌పాడు జలాశయంలో శనివారం పూర్తిస్థాయి నీటిమట్టం 1,021 అడుగులు ఉన్నట్లు ఏఈ వరప్రసాద్ తెలిపారు. జలాశయానికి జూరాల ఎడమ, సమాంతర కాల్వ నుంచి నీటి సరఫరా నిలిచిపోగా.. ఎన్టీఆర్ కాల్వకు 875 క్యూసెక్కులు, కుడి, ఎడమ కాల్వలకు 15 క్యూసెక్కులు, తాగునీటి అవసరాలకు 20 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నామని వివరించారు.
గ్రామీణ క్రీడలను
ప్రోత్సహించాలి
పాన్‌గల్: ప్రభుత్వం క్రీడారంగంపై ప్రత్యేక దృష్టి సారించి గ్రామీణ క్రీడలను ప్రోత్సహించాలని డీవైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షుడు కోట రమేష్ కోరారు. మండలంలోని రేమద్దులలో ఎస్‌ఎఫ్‌ఐ, డీవైఎఫ్‌ఐ, ఐద్వా, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన క్రీడా పోటీల ముగింపు కార్యక్రమం శనివారం సాయంత్రం నిర్వహించగా.. ఆయన ముఖ్యఅతిథిగా హాజరై విజేతలకు బహుమతులు అందజేసి మాట్లాడారు. యువత చెడుమార్గంలో పయనించకుండా చదువు, క్రీడలపై దృష్టి సారించి సమాజంలో మార్పునకు తమవంతు ప్రయత్నం చేయాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగ ఖాళీలను సకాలంలో భర్తీ చేయకనే నిరుద్యోగ సమస్య పెరిగిందని.. నిరుద్యోగుల సమస్యల పరిష్కారానికి డీవైఎఫ్‌ఐ అండగా ఉంటుందని చెప్పారు. గ్రామీణ క్రీడలను ప్రోత్సహించేందుకు ఇలాంటి పోటీలు ఎంతగానో ఉపయోగపడుతాయని ఆవాజ్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎండీ జబ్బార్ అన్నారు. స్థానిక సమస్యల పరిష్కారానికి సర్పంచులు ప్రత్యేక చొరవ చూపాలని కోరారు. నిరుద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని గొర్రెలు, మేకల పెంపకందారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కిల్లె గోపాల్ అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల సమస్యలపై దృష్టి సారించాలని, సమాన పనికి సమాన వేతనం అందడం లేదని ఐద్వా సంఘం జిల్లా కార్యదర్శి లక్ష్మి తెలిపారు. సమావేశంలో సర్పంచ్ నిరంజన్, గోపల్‌దిన్నె సర్పంచ్ కవిత, ఆయా సంఘాల నాయకులు, క్రీడాకారులు, ప్రజానాట్య మండలి కళాకారులు పాల్గొన్నారు.
డీఎంఆర్‌ఎం ట్రస్ట్ సేవలు అభినందనీయం
అమరచింత: డీఎంఆర్‌ఎం ట్రస్ట్ సేవలు అభినందనీయమని హైకోర్టు న్యాయమూర్తులు మాధవిదేవి, అనిల్‌కుమార్ జూకంటి అన్నారు. శనివారం మక్తల్‌లో కోర్టు ప్రారంభోత్సవానికి వచ్చిన వారు తిరుగు పయనంలో అమరచింతలోని మాజీ అడ్వొకేట్ జనరల్, హైకోర్టు న్యాయవాది దేశాయి ప్రకాష్‌రెడ్డి ఇంటికి వచ్చారు. ఈ సందర్భంగా ప్రకాష్‌రెడ్డి పుట్టిన ఊరి కోసం చేస్తున్న కార్యక్రమాలు తెలుసుకొని అభినందించారు. యువత, ప్రజలు ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తే గ్రామాలు అన్నింటా అభివృద్ధి సాధిస్తాయన్నారు. వీరి వెంట నారాయణపేట జిల్లా న్యాయమూర్తి శ్రీనివాసులు ఉన్నారు.
ఇంటి వద్దకే మేడారం బంగారం ప్రసాదం
స్టేషన్ మహబూబ్‌నగర్: ములుగు జిల్లాలో ఈనెల 28వ తేదీ నుంచి 31 వరకు జరగనున్న సమ్మక్క సారలమ్మ జాతర నేపథ్యంలో మేడా రం వెళ్లలేని భక్తులకు ఇంటివద్దకే అమ్మవార్ల బంగారం ప్రసాదాన్ని టీజీఎస్‌ఆర్టీసీ లాజిస్టిక్ ద్వారా అందజేయనున్నట్లు ఆర్టీసీ రీజినల్ మేనేజర్ సంతోష్‌కుమార్ తెలిపారు. ఆర్‌ఎం కార్యాలయంలో టీజీఎస్‌ఆర్టీసీ లాజిస్టిక్ మేడా రం కరపత్రాలను ఆయన ఆవిష్కరించారు. భక్తులు రూ.299 చెల్లిస్తే దేవాదాయశాఖ సహకారంతో మేడారం అమ్మవార్ల బంగారం ప్రసాదం పాకెట్, దేవతల ఫొటోతో సహా బెల్లం, పసుపు కుంకుమ వస్తువులు అందజేయడం జరుగుతుందన్నారు. భక్తులు www.tgsrtclogistics.co.in వెబ్‌సైట్ లాగిన్ ద్వారా లేదా సమీపంలోని టీజీఎస్‌ఆర్టీసీ లాజిస్టిక్ కౌంటర్లలో బంగారం ప్రసాదాన్ని బుక్ చేసుకోవచ్చని తెలిపారు.
రామన్‌పాడుకు నీటి సరఫరా నిలిపివేత


