పాలమూరు, రాష్ట్ర సరిహద్దు వరకూ దాన్ని తరిమికొట్టాలి
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: ‘ఎన్నికల్లో కాంప్రమైజ్ అయ్యేది లేదు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ను ఓడగట్టాం. 2024లో గుండుసున్నా ఇప్పించినం. కాంటోన్మెంట్, జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో బొందపెట్టినం. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో 66శాతం సర్పంచ్‌లను గెలిపించుకున్నం. అంతే నాకు శత్రువులు ఎవరూ లేరు. పేదరికం, మహిళలకు అన్యాయం చేసేవాళ్లు, విద్యార్థులకు నష్టం చేసేవాళ్లు మాకు శత్రువులు. పేదరికాన్ని పాలమూరు నుంచి, రాష్ట్ర సరిహద్దు దాటే వరకూ తరిమి కొట్టాలన్నదే మా లక్ష్యం.’ అని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి అన్నారు. మహబూబ్‌నగర్‌లో రూ.1,284 కోట్ల వ్యయంతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు శనివారం ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం ఎంవీఎస్ మైదానంలో జరిగిన బహిరంగసభలో ప్రజనుద్దేశించి మాట్లాడారు. ఉచితంగా ఏది ఇచ్చినా శాశ్వతం కాదని.. విద్య ఒక్కటే శాశ్వతం. విద్యార్థులు క్రమశిక్షణతో ఉన్నత తీరాలను చేరాలని ఆకాంక్షించారు. దేశ మొదటి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ స్ఫూర్తితో విద్య, సాగునీటికి మొదటి ప్రాధాన్యం ఇస్తున్నామని వెల్లడించారు. చదువే మన భవిష్యత్‌ను మారుస్తుందని.. పాలమూరులో పంటలు పండి రైతుల కళ్లల్లో ఆనందం నిండాలని ఆకాంక్షించారు. ఉమ్మడి జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్ట్‌లను పూర్తి చేసే బాధ్యత తనదన్నారు. ఇది వేగంగా సాగేలా ఉమ్మడి జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు ఎక్కడెక్కడ భూసేకరణ, ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ పెండింగ్‌లకు సంబంధించి బాధితులకు నష్ట పరిహారం ఇప్పించాలని సూచించారు. రేవంత్‌రెడ్డి ఇంకేమన్నారో ఆయన మాటల్లోనే..
పర్యాటక ప్రాంతాలుగా మార్చి ప్రాజెక్ట్‌లు చూపించాలి..
గతంలో టోనీబ్లెయర్, బిల్‌గేట్స్ వంటి వారు దేశంలో పర్యటనలు చేసేవారు. పాలమూరు పేదరికాన్ని చూపెట్టేందుకు ఆనాటి ముఖ్యమంత్రులు వారిని మన ప్రాంతానికి తీసుకొచ్చేవారు. ఇక్కడ ప్రజలు వలసపోతున్నారు.. బట్టలు లేవు.. తిండి లేదంటూ వారికి చూపించి బిచ్చం వేయాలని కోరేవారు. ఇది ఎంత బాధాకరం. అందుకే మన అభివృద్ధిని చూపించేలా మార్పురావాలి. పర్యాటక ప్రాంతాలుగా మార్చి మన ప్రాజెక్ట్‌లను చూపాలి, ట్రిపుల్ ఐటీ, ఐఐఎంలు చూపించాలి. పాలమూరు నుంచి దేశానికి సేవలు అందించాలి.
అదే లక్ష్యంగా కృషి..
విద్య, సాగునీటికే మా మొదటి ప్రాధాన్యం
త్వరలో 35 లక్షల మంది పట్టణ మహిళలకు ఇందిరమ్మ చీరలు
బహిరంగ సభలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి
రూ.1,284 కోట్ల వ్యయంతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన


