లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా ఉద్యమం
అమరచింత: కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న 4 లేబర్ కోడ్లను వ్యతిరేకిస్తూ ఫిబ్రవరి 12న దేశవ్యాప్త సమ్మెకు కేంద్ర కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయని టీయూసీఐ రాష్ట్ర ప్రధానకార్యదర్శి సూర్యం తెలిపారు. శనివారం మండల కేంద్రంలోని మార్క్ భవనంలో నిర్వహించిన సంఘం జిల్లా ముఖ్య నాయకుల సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై కేంద్ర ప్రభుత్వం కార్మికవర్గంపై విధిస్తున్న ఆంక్షలపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. కార్మికులు, కర్షకులకు నష్టం కలిగించే చట్టాలను వెంటనే రద్దు చేయాలని, దేశవ్యాప్త సమ్మెలో భాగంగా ఆదివారం హైదరాబాద్‌లోని ఎస్‌వీకే మినీహాల్‌లో జరిగే రాష్ట్ర సదస్సుకు కార్మికులు అధికసంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ప్రధాని మోదీ కార్పొరేట్ వ్యవస్థను బలోపేతం చేస్తూ ప్రభుత్వరంగ సంస్థలను ఒక్కొక్కటిగా ప్రైవేట్‌పరం చేస్తున్నారని ఆరోపించారు. కార్పొరేట్, పెట్టుబడిదారులను అందలం ఎక్కించే కుట్రలో భాగంగానే లేబర్ కోడ్లను తీసుకొస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జాతీయ ఉపాధిహామీ పథకం పేరు మార్చి బడ్జెట్‌లో కేటాయించాల్సిన నిధులు, కూలీల పనిదినాలు తగ్గించి వారికి ఉపాధిని దూరం చేయడం దారుణమన్నారు. కార్యక్రమంలో సంఘం జిల్లా ప్రధానకార్యదర్శి అరుణ్‌కుమార్, సహాయ కార్యదర్శి గణేష్, కోశాధికారి ఎదుట్ల కురుమయ్య, జిల్లా నాయకులు కురుమన్న, ప్రేమరత్నం, చెన్నయ్య, సుబ్బయ్య, రాజు పాల్గొన్నారు.
కేంద్ర విధానాలపై
ఉద్యమిద్దాం
వనపర్తి రూరల్: కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న రైతులు, వ్యవసాయ కూలీల విధానాలపై ఉద్యమించాలని రైతు సంఘం రాష్ట్ర నాయకుడు ఎండీ జబ్బార్ పిలుపునిచ్చారు. శనివారం జిల్లాకేంద్రంలోని అంబేడ్కర్ చౌరస్తాలో సీఐటీయూ, రైతుసంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టగా ఆయన పాల్గొని మాట్లాడారు. అనేక ఏళ్లు పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను బీజేపీ ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్లుగా విభజించిందని.. ఓ పక్క ప్రజా సంక్షేమం అంటూనే మరోపక్క కార్పొరేట్లకు రూ.వేల కోట్లు కట్టబెడుతున్నారని ఆరోపించారు. 2005 విద్యుత్ సవరణ బిల్లు, విత్తన బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. మహాత్మాగాంధీ జాతీయ ఉపాధిహామీ పథకాన్ని రద్దుచేసి వీబీజీ రామ్‌జీ బిల్లు పార్లమెంట్‌లో ప్రవేశపెట్టి పేదల నోట్లో మట్టి కొట్టారని విమర్శించారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఆర్‌ఎస్ రమేశ్, కార్యదర్శి రాజు, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు బాల్‌రెడ్డి, కార్యదర్శి పరమేశ్వరాచారి, ఉపాధ్యక్షులు గోపి, ఉమా పాల్గొన్నారు.
లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా ఉద్యమం


