వనపర్తి: యువత సంస్కారవంతంగా, బాధ్యతాయుతంగా ఉండాలని.. భవిష్యత్ అంతా వారిదేనని ఎస్పీ రావుల గిరిధర్ అన్నారు. బుధవారం జిల్లాకేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాలలో నెహ్రూ యువకేంద్రం, మహబూబ్‌నగర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉమ్మడి జిల్లాస్థాయి ‘యువ ఉత్సవ్–2025’ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎక్కడా లేని యువశక్తి మన దేశంలో ఉందని, వారు సరైన మార్గం ఎంచుకుంటే ప్రపంచంలో మనకు తిరుగులేదని పేర్కొన్నారు. యువత తమకు ఆసక్తి ఉన్న రంగాన్ని ఎంచుకొని అందులో గొప్పగా రాణించాలని సూచించారు. తల్లిదండ్రులు, గురువులు, సాటివారిని గౌరవించే తత్వాన్ని అలవర్చుకోవాలని.. ఉపాధ్యాయులు విద్యార్థుల ఆసక్తిని గుర్తించి ప్రోత్సహిస్తే అద్భుత ఆవిష్కరణలు వెలుగులోకి వస్తాయని వివరించారు. అనంతరం సైన్స్ మేళాను ఆయన తిలకించి చక్కటి ఎగ్జిబిట్లు తయారు చేసిన విద్యార్థులను అభినందించారు. యువ ఉత్సవ్‌లో భాగంగా 15 ఏళ్ల నుంచి 29 ఏళ్లలోపు యువతకు నిర్వహించిన కవిత్వం, చిత్రలేఖనం, సైన్స్ మేళా, ఉపన్యాసం తదితర పోటీల్లో ప్రతిభ కనబర్చిన వారికి ప్రశంసాపత్రాలు, జ్ఞాపికలు అందించారు. కార్యక్రమంలో నెహ్రూ యువకేంద్రం మహబూబ్‌నగర్ జిల్లా అధ్యక్షుడు కోటనాయక్, పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ డా. జగన్, జిల్లా సైనన్స్ అధికారి శ్రీనివాస్, డీవైఎస్‌ఓ సుధీర్‌రెడ్డి, రెడ్‌క్రాస్ సొసైటీ రాజేందర్, తెలుగు అధ్యాపకుడు ఎజ్జు మల్లయ్య, నిస్వార్థ ఆర్గనైజేషన్ సభ్యుడు అరవింద్, నెహ్రూ యువకేంద్రం ప్రోగ్రాం కో–ఆర్డినేటర్లు రాజేందర్‌గౌడ్, అనిల్‌కుమార్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.