విజయనగరం గంటస్తంభం: రాష్ట్రంలో డీఎస్సీ నియామకాల్లో అక్రమాలు జరిగాయని, సీబీఐతో సమగ్ర విచారణ జరిపించి అర్హులకు న్యాయం చేయాలని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు(చిన్నశ్రీను) డిమాండ్ చేశారు. మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి, పార్టీ నాయకులతో కలిసి కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డికి కలెక్టరేట్‌లో సోమవారం వినతిపత్రం అందజేశారు. డీఎస్సీ నియామకాలపై సీబీఐ విచారణ పూర్తయ్యే వరకు విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నిరుద్యోగ భృతిని రూ.75 వేల పెండింగ్ బకాయిలతో చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, మాజీ ఎమ్మెల్యేలు బొత్స అప్పలనరసయ్య, శంబంగి వెంకట చినఅప్పలనాయుడు, బడ్డుకొండ అప్పలనాయుడు, కడుబండి శ్రీనివాసరావు, రాజాం నియోజకవర్గ ఇన్‌చార్జి తలే రాజేష్, నియోజకవర్గ పరిశీలకులు కిల్లి సత్యనారాయణ, కె.వి.సూర్యనారాయణ రాజు, నెక్కల నాయుడుబాబు, శోభా స్వాతిరాణి, సిరిపురపు జగన్‌మోహన్‌రావు, జిల్లా ప్రధాన కార్యదర్ములు ఇప్పలి అనంత్, శంబంగి వేణుగోపాల్ నాయుడు, గొర్లి రవికుమార్, జిల్లా ఎస్సీసెల్ చైర్మన్ పీరుబండి జైహింద్‌కుమార్, యువ నాయకుడు కౌశిక్‌తో పాటు వైఎస్సార్‌సీపీ నాయకులు పలువురు పాల్గొన్నారు.
డీఎస్సీలో భారీ అక్రమాలు
కూటమి ప్రభుత్వం డీఎస్సీ నియామాకాల్లో భారీ అక్రమాలకు పాల్పడింది. టెట్ పరీక్ష రాయని వారికి స్పోర్ట్స్ కోటాలో నియామకాలు జరిగాయి. విజయనగరం జిల్లాలోనే పది మందికి అర్హతులు లేకుండానే ఉపాధ్యాయ ఉద్యోగాలు ఇచ్చినట్లు సమాచారం ఉంది. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన అక్రమాలపై సీబీఐ విచారణ జరిపితేనే నిజాలు వెలుగులోకి వస్తాయి. రూ.10 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయకుండా విద్యార్థులను ఇబ్బందులకు గురిచేయడం సరికాదు. రెండున్నరేళ్లుగా నిరుద్యోగ భృతి ఊసేలేదు. నిరుద్యోగ యువతను మోసం చేశారు. దీనిపై ఈనెల 6నుంచి 9 వరకు రిలే నిరాహార దీక్షలు చేస్తాం. – మజ్జి శ్రీనివాసరావు,
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు
అభ్యర్థులకు న్యాయం జరగాల్సిందే...
డీఎస్సీ అక్రమాల కారణంగా ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం కష్టపడి పరీక్షలు రాసిన అఽభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరిగింది. అక్రమాలపై సీబీఐ విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి. కూటమి ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజల అన్యాయానికి గురవుతున్నారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరాటం కొనసాగిస్తుంది.
– కోటగట్ల వీరభద్రస్వామి,
మాజీ డిప్యూటీ స్పీకర్
డీఎస్సీ అక్రమాలకు మంత్రి నారా లోకేశ్ బాధ్యత వహించాలి
ఫీజు రీయింబర్స్‌మెంట్, నిరుద్యోగ భృతి బకాయిలు చెల్లించాలి
సీబీఐ విచారణ కోరుతూ కలెక్టర్‌కు వినతిపత్రం అందజేసిన వైఎస్సార్‌సీపీ నేతలు


