రేగిడి: మండల పరిధిలోని సరసనాపల్లి గ్రామంలో బుధవారం రాత్రి అన్నదమ్ముల మధ్య తలెత్తిన వివాదంలో అన్న చేతిలో తమ్ముడు హతమయ్యాడు. ఈ ఘటనపై ఎస్సై వి.బాలకృష్ణ అందించిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన గొడేఅప్పడు, గొడే కృష్ణ(50) అన్నదమ్ములు. వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వారికి ఉమ్మడిగా పది సెంట్లు మేర టేకు చెట్లు ఉన్న స్థలం ఉంది. ఈ స్థలానికి సంబంధించి ప్రతిరోజూ గొడవ పడుతున్నారు. ఇద్దరూ మద్యం తాగుతుంటారు. యథావిధిగా బుధవారం రాత్రి కూడా ఇద్దరూ మద్యం తాగి భూమికోసం గొడవపడ్డారు. అన్నయ్య గొడే అప్పడు మద్యం మత్తులో భూమి వాటాల గురించి తమ్ముడు కృష్ణ వద్ద ప్రస్తావించాడు. దీంతో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. వెంటనే గొడే అప్పడు తన ఇంట్లో ఉన్న తాటిపట్టి చెక్క తీసుకువచ్చి తమ్ముడు కృష్ణ తలపై, నుదుటిపై వంటిపై ఇష్టానుసారం కొట్టాడు. దీంతో కృష్ణ అక్కడికక్కడే మృతిచెందాడని ఎస్సై తెలిపారు. అప్పడు వెంటనే ఘటనా స్థలం నుంచి పరారవడంతో ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. హతుడు కృష్ణ భార్య రాములమ్మ గడిచిన ఇరవై సంవత్సరాల నంచి కన్నవారి గ్రామమైన రేగిడిలో తన ముగ్గురు పిల్లలతో ఉంటోంది. అప్పడు భార్య గతంలోనే మృతిచెందింది. ఇద్దరు పిల్లలు విశాఖ పట్నంలో తాపీ పని చేసుకుంటున్నారు. అప్పడు వ్యసనానికి బానిస కావడంతో ఈ ఘటన జరిగిందని ఎస్సై తెలిపారు. ఘటనా స్థలాన్ని రాజాం టౌన్ సీఐ డి.నవీన్‌కుమార్, ఎస్సై వి.బాలకృష్ణ గురువారం పరిశీలించారు. రాజాం సామాజిక ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు మృతదేహాన్ని అప్పగించారు. మృతుని భార్య రాములమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు జరుపుతున్నామని ఎస్సై తెలిపారు.
కర్రల లారీ బోల్తా
దత్తిరాజేరు: మండలంలోని పెదమానాపురం టోల్ ప్లాజా వద్ద గురువారం తెల్లవారు జామున విజయనగరం నుంచి రాయగడ వెళ్తున్న కర్రల లారీ బోల్తా పడింది. దీంతో డ్రైవర్ తిరుమల రావు చేతికి తీవ్ర గాయాలయ్యాయి డ్రైవర్‌ను వెంటనే ప్రాథమిక చికిత్స నిమిత్తం గజపతినగరం ఆస్పత్రికి తరలించినట్లు లారీ యజమాని అప్పారావు తెలిపారు. రాయగడ వెళ్తున్న లారీ పెదమానాపురం వద్దకు వచ్చేసరికి డ్రైవర్ ఒకసారిగా మత్తు నిద్రలోకి జారిపోవడంతో బోల్తా పడి బాడీ మొత్తం నుజ్జునుజ్జు అవడంతో పాటు వివిధ రకాల లారీ పార్టులు కూడా పాడైనట్లు యజమాని తెలిపారు.


