● లోపాలకు తావులేకుండా శాఖలు
సమన్వయంతో పనిచేయాలి
● ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటి కృష్ణబాబు, ప్రత్యేక అధికారి వీరపాండ్యన్
పూసపాటిరేగ: ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేతులమీదుగా ఆగస్టు 1న జరగనున్న అల్లూరిసీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ కార్యక్రమం ప్రతిష్టాత్మక వేడుకగా నిలిచేలా అన్ని ఏర్పాట్లు అత్యున్నత ప్రమాణాలతో పూర్తిచేయాలని ప్రధానమంత్రి పర్యటన నోడల్ అధికారి ఎంటి కృష్ణబాబు ,ప్రధానమంత్రి పర్యటన ప్రత్యేక అధికారి జి. వీరపాండ్యన్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు గురువారం కలెక్టర్ రాంసుందర్‌రెడ్డితో కలిసి భోగాపురంలోని అల్లూరిసీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని వారు సందర్శించారు. ప్రారంభోత్సవానికి సంబంధించిన ప్రతి అంశాన్ని క్షణ్ణంగా పరిశీలించారు. ముందుగా విమానాశ్రయం టెర్మినల్‌ను సందర్శించిన అధికారులు అరైవల్, డిపార్చర్, చెక్‌ఇన్ కౌంటర్లు, భద్రతా తనిఖీ కేంద్రాలు, వీఐపీ లాంజ్‌లు, ప్రయాణికుల నిరీక్షణ మందిరాలు, బ్యాగేజ్ క్లెయిమ్ ఏరియా, బోర్డింగ్‌ప్రాంతాలు, విమానాల ల్యాండింగ్‌కు సంబంధించిన సదుపాయాలు, అంతర్గత రాకపోకల ఏర్పాట్లు సమగ్రంగా పరిశీలించారు. ప్రధానమంత్రి రాక సందర్భంగా అనుసరించాల్సిన ప్రోటోకాల్ భద్రతా ప్రమాణాలు, అతిథుల స్వాగత ఏర్పాట్లు, వివిధ శాఖల మధ్య సమన్వయం తదితర అంశాలపై అధికారులకు పలుసూచనలు చేశారు.
అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలి
పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరుకానున్న నేపథ్యంలో ట్రాఫిక్ నిర్వహణ, వాహనాల పార్కింగ్, ప్రజల కదలికలు, భద్రత, తాగునీరు, వైద్యసేవలు, పారిశుధ్యం వంటి అంశాల్లో ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని శాఖలు పరస్పరం సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. నిర్ణీత గడువులో అన్ని పనులు పూర్తిచేసి, ప్రతి ఏర్పాటును పలుమార్లు తనిఖీ చేసి కార్యక్రమం విజయవంతమయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో రాష్ట్ర ఎయిర్‌పోర్ట్స్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రవీణ్ ఆదిత్య, పురపాలక శాఖ కమిషనర్ పి.సంపత్‌కుమార్, విజయనగరం, అనకాపల్లి జాయంట్ కలెక్టర్‌లు సేతుమాధవన్, సౌర్యమాన్‌పటేల్, జీసీసీ మేనేజింగ్ డైరెక్టర్ శోభిత, అదనపు ఎస్పీ సౌమ్యలత, జీఎంఆర్ ప్రతినిధులు ఐ.ప్రభాకరరావు, రామరాజుతో పాటు వివిధశాఖల న్నతాధికారులు పాల్గొన్నారు.
భద్రతా ఏర్పాట్ల పరిశీలన
అనంతరం ప్రధానమంత్రి విమానాశ్రయంలో నిర్వహించనున్న వాక్‌త్రూ మార్గాన్ని పరిశీలించి, వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల ప్రదర్శనలు, ప్రత్యేక ప్రదర్శన స్టాళ్లు, అతిథుల కదలికలు, విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాల వేదికలు, కళాకారుల ఏర్పాట్లు, సౌండ్‌సిస్టమ్, అలంకరణ, స్వాగత కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. సాంస్కృతిక కార్యక్రమాలు సమయపాలనతో, ఆకర్షణీయంగా నిర్వహించేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. తదుపరి బహిరంగ సభాప్రాంగణాన్ని సందర్శించి ప్రధాని వేదిక, వీవీఐపీ, వీఐపీ, ప్రజాప్రతినిధులు, అధికారులు, ఆహ్వానితులు, మీడియాప్రతినిధులు, ప్రజలకోసం ఏర్పాటు చేస్తున్న ప్రత్యేక ఎన్‌క్లోజర్లు, మీడియా గ్యాలరీ, నియంత్రణ కేంద్రం, ప్రవేశ, నిష్క్రమణ మార్గాలు, పార్కింగ్‌ప్రాంతాలు, బారికేడింగ్, భద్రతా ఏర్పాట్లు , తాగునీరు, మరుగుదొడ్లు, వైద్య శిబిరాలు, అత్యవసర సేవలు, విద్యుత్ , కమ్యూనికేషన్ సదుపాయాలను క్షణ్ణంగా పరిశీలించారు.


