వర్షాభావంతో.. వీఆర్‌ఎస్‌ వెలవెల | - | Sakshi
Sakshi News home page

వర్షాభావంతో.. వీఆర్‌ఎస్‌ వెలవెల

Jul 24 2026 1:45 AM | Updated on Jul 24 2026 1:45 AM

వర్షాభావంతో.. వీఆర్‌ఎస్‌ వెలవెల

మక్కువ: మక్కువ, సాలూరు మండలాల్లో వర్షాలు కురవకపోయినా.. వీఆర్‌ఎస్‌ ప్రాజెక్ట్‌ ఎగువనున్న ఒడిశా రాష్ట్రంలో వర్షాలు కురిస్తే ప్రాజెక్ట్‌లోకి గోముఖి, సువర్ణముఖి నదుల ద్వారా నీరు చేరి, ఏటా జూలై మొదటి, రెండు వారాల్లో వీఆర్‌ఎస్‌ నీటితో కళకళలాడేది. ప్రస్తుతం వాతావరణ పరిస్థితుల్లో మార్పులు చోటు చేసుకుని వర్షాభావం ఏర్పడడంతో ఒడిశా రాష్ట్రంలో కూడా వర్షాలు కురవకపోవడంతో వీఆర్‌ఎస్‌లోకి నీరు చేరక ప్రాజెక్టు వెలవెలబోతుంది. ఈ ప్రాజెక్టు ఫుల్‌ రిజర్వుడు లెవెల్‌(ఎఫ్‌ఆర్‌ఎల్‌) 161 మీటర్లు కాగా, ప్రస్తుతం 155 మీటర్లు లెవెల్‌లో నీరు నిల్వ ఉండడంతో ఈ ఏడాది ఖరీఫ్‌ సాగు ప్రశ్నార్థకంగా మారుతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

అధికారుల నిర్లక్ష్యం

ఎలినినో ప్రభావం ఓ వైపు ఆందోళనకు గురి చేస్తుంటే మరో వైపు అధికారుల నిర్లక్ష్యం కూడా రైతులను ఆవేదనకు గురి చేస్తోంది. కొన్నేళ్ల నుంచి స్పిల్‌వే రెగ్యులేటర్లు మరమ్మతులకు గురైనా.. మరమ్మతులు చేయించడంలో అధికారులు నిర్లక్ష్యం చూపుతున్నారని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఫలితంగా సాగు నీటికి ఇబ్బందులు పడాల్సి వస్తుందని పేర్కొంటున్నారు. స్పిల్‌వే ద్వారా నీరు లీకై ఏడాది పొడవునా కాలువల ద్వారా నదుల్లోకి నీరు వృథాగా పోతున్నా.. చర్యలు చేపట్టడం లేదని రైతులు ఆక్రోశిస్తున్నారు. జైకా నిధులతో పనులు జరిపిస్తామని ఏటా అధికారులు నెట్టుకొస్తున్నారే తప్ప పనులు మాత్రం చేయించడం లేదని వారు ఆరోపిస్తున్నారు.

చేపలు చెరువులకు సాగు నీరు

వీఆర్‌ఎస్‌ ఎడమ ప్రధాన కాలువ నుంచి చేపల చెరువులకు పలువురు రైతులు సాగునీరు మళ్లిస్తున్నా.. అధికారులు చూసీచూడనట్టు వ్యవహరించడం వల్లే ప్రాజెక్టులో నీటి నిల్వలు లేకుండా పోతున్నాయని రైతులు విమర్శిస్తున్నారు. నిత్యం ఈ ప్రాజెక్టు ద్వారా ఇలా జరుగుతున్నా.. అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని వారు ప్రశ్నిస్తున్నారు.

ఎట్టకేలకు ట్రెంచ్‌ తొలగింపు

కుడి ప్రధాన కాలువ పరిధిలో ఇటీవల సప్టా పనులు చేయించారు. దీంతో స్పిల్‌వే ద్వారా లీకై న నీటిని సువర్ణముఖి నదిలోకి మళ్లించారు. నారుమడులు ఎండిపోవడంతో రైతులు మోటార్లు, వాటర్‌ ట్యాంకర్లు, బిందెలతో తడిపి రక్షించుకుంటున్నారు. అయినా అధికారులు ట్రెంచ్‌ తొలగించి కాలువలకు నీటిని సరఫరా చేయకుండా వదిలేశారు. ఎట్టకేలకు శనివారం కుడి, ఎడమ ప్రధాన కాలువల పరిధిలో జేసీబీ సాయంతో ట్రెంచ్‌లు తొలగించి కాలువలకు నీటిని విడిచి పెట్టారు. ఇప్పటికై నా ఇరిగేషన్‌ అధికారులు స్పందించి సాగునీరు వృథా కాకుండా ఖరీఫ్‌ సాగుకు అవసరమైన నీటిని పంట పొలాలకు అందించాలని ఈ ప్రాంత రైతులు కోరుతున్నారు.

వీఆర్‌ఎస్‌ ఎఫ్‌ఆర్‌ఎల్‌ 161 మీటర్లు

ప్రస్తుతం నిల్వ ఉన్న నీరు 155 మీటర్లు

స్పిల్‌వే రెగ్యులేటర్లు ద్వారా లీకవుతున్న నీరు

ఎట్టకేలకు కాలువల్లో ట్రెంచ్‌లు

తొలగించిన ఇరిగేషన్‌ అధికారులు

చేపల చెరువులకు నీటి మళ్లింపుతో సాగునీటి కష్టాలు

ఖరీఫ్‌ సాగు కష్టమేనంటున్న రైతన్నలు

ఖరీఫ్‌ వరి సాగు సాధారణ విస్తీర్ణం 12,300 ఎకరాలు

మండలంలోని ఖరీఫ్‌ వరి సాగు సాధారణ విస్తీర్ణం 12,300 ఎకరాలు కాగా, ప్రస్తుతం 120ఎకరాల్లో వెదజల్లే పద్ధతిలో సాగు చేసేందుకు రైతులు సమాయత్తమయ్యారు. మిగిలిన 12,180 ఎకరాల్లో వరి సాగు, వర్షాలు, వీఆర్‌ఎస్‌ ప్రాజెక్ట్‌ కాలువలు ద్వారా సరఫరా అయ్యే సాగు నీటిపైనే ఆధారపడాల్సి ఉంది. ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు కురవకపోవడంతో, నారుమడులు ఎండిపోతున్నాయి. ఏటా ఆగస్టు మొదటి వారంలో వీఆర్‌ఎస్‌ ప్రాజెక్ట్‌ కాలువల ద్వారా నీటిని విడిచిపెట్టగా, ఆగస్టు నెలాఖారులోగా ఉభాలు పూర్తయ్యేవి. ప్రస్తుతం వర్షాలు కురవకపోవడంతో ఈ ఏడాది ఖరీఫ్‌ సాగుపై రైతుల్లో సందిగ్ధత నెలకొంది. ఏం చేయాలో పాలుపోక ఆందోళన చెందుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement