రాజాం సిటీ: మున్సిపాల్టీ పరిధి పొనుగుటివలస గ్రామాన్ని సర్టిఫికెట్ల సమస్య వేధిస్తోంది. విద్యాసంవత్సరం ముగిసింది. తమ పిల్లలు మరో మెట్టుపైకి వస్తున్నారని తల్లిదండ్రులు మురిసిపోతూ సచివాలయానికి కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలకోసం వెళ్లుంటే అక్కడ చేదు అనుభవం ఎదురవుతోంది. సచివాలయంలో దరఖాస్తు చేసుకున్న తరువాత సంతకవిటి వెళ్లాలని అక్కడ తహసీల్దార్ సంతకం చేసుకుని రాజాం తహసీల్దార్ వద్దకు వెళ్తే సర్టిఫికెట్ వస్తుందని చెబుతుండడంతో అవాక్కవుతున్నారు. గతంలో ఈ సమస్య ఎప్పుడూ రాలేదని వారితే చెప్పినా తమకు ఫలితంలేకుండా పోతోందని గ్రామస్తులు వాపోతున్నారు.
గత ప్రభుత్వంలో సచివాలయంలోనే..
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో సేవలు ప్రజల ముంగిటకే అందేవి. విద్యార్థులకు కావాల్సిన కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు గ్రామ/వార్డు సచివాలయాల్లోనే వెంటవెంటనే అందడం వంటి సేవలను ప్రజలు ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నారు. ప్రస్తుతం సర్టిఫికెట్లు కావాలన్నా ఇబ్బందులు పడక తప్పడంలేదని ప్రజలు, విద్యార్థులు వాపోతున్నారు. కూతవేటు దూరంలో ఉన్న రాజాంలో కాకుండా 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న సంతకవిటి తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లాల్సి వస్తోందని, అక్కడినుంచి మళ్లీ సర్టిఫికెట్లు పొందేందుకు రాజాం తహసీల్దార్ కార్యాలయానికి రాక తప్పడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో మాదిరి కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు సచివాలయంలోనే అందించాలని కోరుతున్నారు.
ఇదీ అసలు సమస్య..
2005 వరకు సంతకవిటి మండలంలో కొనసాగిన పొనుగుటివలస గ్రామం ప్రస్తుతం రాజాం మున్సిపాల్టీలో కొనసాగుతోంది. 2005లో రాజాం మండలంలోని రాజాం, సారథి మేజర్ పంచాయతీలతోపాటు కొత్తవలస, కొండంపేట, సంతకవిటి మండలం పొనుగుటివలస గ్రామాలను కలుపుతూ నగరపంచాయతీగా ఏర్పాటుచేశారు. అప్పటికే ఈ పంచాయతీలకు సర్పంచ్‌లుగా ఉన్నవారి పదవీకాలం ముగియకపోవడంతో వారు కోర్టును ఆశ్రయించారు. దీంతో నగరపంచాయతీ (2020లో థర్డ్‌గ్రేడ్ మున్సిపాల్టీగా రాజాం అప్‌గ్రేడ్) ఏర్పడినప్పటికీ మిగతా పనులు ఎక్కడివక్కడే మిగిలిపోయాయి. దీంతో సంతకవిటి మండలంలో భాగమైన పొనుగుటివలస రెవెన్యూ, పంచాయతీ రికార్డులు నగరపంచాయతీకి అప్పగించకుండా సంతకవిటి మండలంలోనే ఉండిపోయాయి. అప్పటి నుంచి ప్రతి పనికి మున్సిపాల్టీకి వెలితే సంతకవిటి మండలానికి వెళ్లాలని, సంతకవిటి వెళ్తే నగరపంచాయతీకే వెళ్లాలని అధికారులు చెబుతుండడంతో చేసేదిలేక అటూ ఇటూ తిరుగుతూ ఏదో విధంగా గ్రామస్తులు తమ పనులను మమ అనిపిస్తున్నారు. ముఖ్యంగా రెవెన్యూ, పోలీసు శాఖల విషయంలో ప్రజలకు ఎక్కువ సమస్యలు తలెత్తుతున్నాయి.
రెండు మండలాల నడుమ నలుగుతున్న విద్యార్థులు
ఇబ్బందులు పడుతున్నామంటున్న గ్రామస్తులు వైఎస్సార్‌సీపీ హయాంలో సచివాలయంలోనే సర్టిఫికెట్ల అందజేత
సమస్య పరిష్కరించాలని గ్రామస్తుల వేడుకోలు


