● అంతర్జాతీయ స్థాయిలో సత్తా
చాటుతున్న శ్రీను
● ఆర్మీలో ఉద్యోగం చేస్తూ.. దేశం తరఫున ప్రాతినిధ్యం
గజపతినగరం రూరల్: మండలంలోని బంగారమ్మపేట గ్రామానికి చెందిన బుగత శ్రీను అంతర్జాతీయ స్థాయి మారథాన్ పరుగులో రాణిస్తూ అందరి మన్నలు పొందుతున్నాడు. ఓ వైపు దేశ సేవలో తరిస్తూ అథ్లెటిక్స్‌లో రాణిస్తున్నారు. 2010లో ఆర్మీలో జనరల్ డ్యూటీలో సిపాయిగా చేరిన శ్రీను ప్రస్తుతం మహారాష్ట్రలోని పుణేలో సుబేధార్‌గా పని చేస్తున్నాడు. ఇదే సమయంలో అథ్లెటిక్స్‌పై ఉన్న ఆసక్తితో జాతీయ, అంతర్జాతీయ పరుగు పందెంలో దేశం తరఫున ప్రాతినిధ్యం వహిస్తూ ఇప్పటి వరకు సుమారు వంద పతకాలు సాధించాడు. ఈ క్రమంలోనే ఈ నెల 14న న్యూఢిల్లీలో జరిగిన ఐఏయూ 50 కిలోమీటర్ల ప్రపంచ చాంపియన్‌షిప్‌లో దేశం తరఫున ప్రాతినిధ్యం వహించి రజిత పతకం సాధించాడు. వివిధ దేశాల నుంచి 42 మంది పాల్గొనగా శ్రీను 14వ స్థానంలో నిలిచాడు. 50 కిలోమీటర్ల పరుగును రెండు గంటల 57 నిమిషాల 49 సెకన్ల వ్యవధిలో ఛేదించి ఈ మైలురాయిని అందుకున్నాడు.
అథ్లెటిక్స్‌పై ఆసక్తి
బుగత శ్రీనును సాక్షి బుధవారం కలవగా తనకు చిన్నప్పటి నుంచి పరుగు పందెం అంటే ఇష్టమని చెప్పాడు. చదువుకున్న రోజుల నుంచే పరుగు పందెంలో పాల్గొనేవాడినని, దీని వల్లే తనకు ఆర్మీలో ఉద్యోగం లభించిందని చెప్పుకొచ్చాడు. ఆర్మీలో శిక్షకుల వద్ద తర్ఫీదు పొందానని చెప్పాడు. ఇప్పటి వరకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వంద పతకాలు సాధించినట్టు తెలిపాడు. యువత తమ లక్ష్యాలను నిర్దేశించుకుని క్రీడల వైపు పయనించాలని సూచించాడు.


