జియ్యమ్మవలస: మండలంలోని వెంకటరాజపురం – సుభద్రమ్మవలస పంట పొలాల్లో బుధవారం ఉదయం ఏనుగులు సంచరిస్తూ కనిపించాయి. దీంతో పార్వతీపురం నుంచి గుమ్మలక్ష్మీపురం ప్రాంతాల ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. ఈ మార్గంలో రోజూ వేల సంఖ్యలో ద్విచక్ర వాహనదారులతో పాటు బస్సులు ఇతరత్రా ప్రయాణ వాహనాల ద్వారా తమ గమ్యానికి ప్రజలు చేరుకుంటారు. ప్రస్తుతం ఈ మార్గంలో ఏనుగులు సంచరిస్తుండడంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న ఆందోళన నెలకొంది. మంగళవారం ఉదయం జొన్న, పామాయిల్ తోటల నుంచి బాసంగి ముంపుడు గుండా వెళ్లడంతో ప్రయాణికులు గంటల తరబడి ఎక్కడికక్కడ నిలిచిపోయారు. మధ్యాహ్నం బాసంగి ముంపుడులో తిష్ట వేశాయి. బుధవారం కూడా ఈ ప్రాంతంలోనే ఉండడంతో సర్వత్రా భయాందోళనలు నెలకొన్నాయి.


