పెండింగ్‌ కేసుల పరిష్కారానికి ప్రాధాన్యమివ్వాలి : ఎస్పీ | - | Sakshi
Sakshi News home page

పెండింగ్‌ కేసుల పరిష్కారానికి ప్రాధాన్యమివ్వాలి : ఎస్పీ

Mar 19 2026 7:26 AM | Updated on Mar 19 2026 7:26 AM

పెండింగ్‌ కేసుల పరిష్కారానికి ప్రాధాన్యమివ్వాలి : ఎస్పీ

నేర సమీక్షా సమావేశంలో అధికారులకు ఆదేశం

● హెల్మెట్‌పై అవగాహన లఘుచిత్రం ఆవిష్కరణ

పార్వతీపురం రూరల్‌ : జిల్లాలో పెండింగ్‌లో ఉన్న గ్రేవ్‌, పోక్సో, ఎన్డీపీఎస్‌ కేసులను త్వరితగతిన పరిష్కరించాలని ఎస్పీ ఎస్‌.వి.మాధవ్‌ రెడ్డి పోలీసు అధికారులను ఆదేశించారు. జిల్లా పోలీస్‌ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన మాసాంతపు నేర సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి కేసులో దర్యాప్తు పూర్తి చేసి, సకాలంలో చార్జ్‌షీట్లు దాఖలు చేయాలని, కోర్టులతో సమన్వయం చేసుకొని సీసీ, ఎస్సీ నంబర్లు పొందాలని సూచించారు. పోలీసింగ్‌లో సాంకేతికత నేర నియంత్రణలో కృత్రిమ మేధ (ఏఐ) కీలక పాత్ర పోషిస్తోందని ఎస్పీ తెలిపారు. ఏఐ4 ఏపీ పోలీస్‌ లోని సోషియంట్‌, 360న్యూస్‌ సేవలను అధికారులు వినియోగించుకోవాలన్నారు. గంజాయి రవాణా అడ్డుకట్టకు డ్రోన్ల ద్వారా నిఘా పెట్టాలని, హాట్‌ స్పాట్లను గుర్తించి నిందితులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పశువుల అక్రమ రవాణాపై దృష్టి సారించాలన్నారు. రహదారి భద్రతపై పార్వతీపురం పట్టణ సీఐ వెంకట్రావు రూపొందించిన హెల్మెట్‌ అవగాహన లఘుచిత్రాన్ని ఎస్పీ ఆవిష్కరించారు. నిబంధనలు అతిక్రమించే వారిపై ఈ–చలాన్లు, డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసులు నమోదు చేయాలని స్పష్టం చేశారు. రాబోయే ఉగాది, రంజాన్‌ పండుగల సందర్భంగా ప్రార్థనా మందిరాల వద్ద ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రత పెంచాలని సూచించారు. విధి నిర్వహణలో, వార్షిక ఫైరింగ్‌ ప్రాక్టీసులో ప్రతిభ కనబరిచిన అధికారులకు, సిబ్బందికి ఎస్పీ ప్రశంసా పత్రాలను అందజేశారు. అదనపు ఎస్పీ వెంకటేశ్వరరావు, డీఎస్పీలు రాంబాబు, థామస్‌ రెడ్డి, వివిధ విభాగాల సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement