విజయనగరం: జిల్లాలోని వివిధ రెవెన్యూ అంశాలపై జాయింట్ కలెక్టర్ ఎస్.సేతుమాధవన్ బుధవారం ఆన్‌లైన్ ద్వారా తమ చాంబర్ నుంచి మండల స్థాయి అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజల నుంచి వచ్చే రెవెన్యూ దరఖాస్తులను పెండింగ్‌లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఆదేశించారు. ముఖ్యంగా మీసేవ ద్వారా అందిన 22ఎ నిషేధిత జాబితా సవరణ దరఖాస్తులను 22ఎ–(1)(ఎ), 22ఎ–(1)(బి) విభాగాల వారీగా సమీక్షించారు. జేసీ, ఆర్‌డీఓ, ఎమ్మార్వో కార్యాలయాల స్థాయిలో ఏ దశలోనైనా దరఖాస్తులు నిలిచిపోకుండా తక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. వెనుకబడ్డ తహసీల్దార్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రీ సర్వే ప్రక్రియలో భాగంగా వెబ్‌ల్యాండ్ పోర్టింగ్‌ను వేగవంతం చేయాలని, ముద్రించిన పట్టాదారు పాస్ పుస్తకాలను రైతులకు తక్షణమే పంపిణీ చేయాలని సూచించారు. ఏప్రిల్ నెలలో చేపట్టాల్సిన పంపిణీపై సమీక్షించారు. వీటితో పాటు మ్యుటేషన్లు, జీరో ఖాతాల సవరణ, ఫిలైన్ మరియు సబ్ డివిజన్ల ప్రక్రియను నిబంధనల ప్రకారం పూర్తి చేయాలన్నారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ద్వారా వచ్చే వినతులను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించాలని, రెవెన్యూ క్లినిక్‌ల సేవలను ప్రజలకు మరింత చేరువ చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. సంక్షేమ పథకాలకు సంబంధించి సివిల్ సప్లైస్ విభాగంలో కొత్త రైస్ కార్డుల దరఖాస్తుల స్థితిగతులను, ఇ–ఆఫీస్ ఫైళ్ల కదలికను పర్యవేక్షించాలన్నారు. సమావేశంలో డీఆర్‌ఓ సిహెచ్.సత్తిబాబు, సీపీఓ పి.బాలాజీ, డీఎస్‌ఓ మురళీనాథ్, డీఎం బి.శాంతి, ఆర్‌డీఓ వెంకటేశ్వరరావు, సర్వే ఏడీ విజయకుమార్, జిల్లాలోని ఆయా విభాగాల అధికారులు, తహసీల్దార్లు, సర్వేయర్లు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.


