పార్వతీపురం రూరల్ : దుకాణాలు, వాణిజ్య సంస్థలను 24 గంటల పాటు తెరిచి ఉంచేందుకు అనుమతినిస్తూ ప్రభుత్వం విడుదల చేసిన జీఓ నంబరు 5ను వెంటనే రద్దు చేయాలని సీఐటీయూ డిమాండ్ చేసింది. ఈ మేరకు బుధవారం పార్వతీపురంలోని సుందరయ్య భవనం నుంచి కలెక్టరేట్ వరకు ఆ సంఘం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి కె.సుబ్బారావమ్మ మాట్లాడుతూ.. ప్రభుత్వ నిర్ణయం కార్మిక చట్టాల మౌలిక లక్ష్యాలకు విరుద్ధంగా ఉందన్నారు. అహోరాత్రులు సంస్థలు తెరిచి ఉంచడం వల్ల అసంఘటిత రంగంలోని చిన్న దుకాణాలు, హోటళ్లు, మాల్స్ కార్మికులపై పని భారం పెరిగి శ్రమదోపిడీకి దారితీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే లేబర్ కోడ్‌ల వల్ల ఉద్యోగ భద్రత దెబ్బతింటుందని, తాజా జీఓ కార్మికులకు మరింత నష్టం చేస్తుందని పేర్కొన్నారు. తక్షణమే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే కార్మిక సంఘాలను ఏకం చేసి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా నేతలు డి.రమణారావు, వై.మన్మధరావు, ఎన్.వై.నాయుడు, వి.ఇందిర, రెడ్డి వేణు, జి.జ్యోతి పాల్గొన్నారు.


