విజయనగరం టౌన్: భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు విశేష కృషి చేసిన వ్యక్తి పొట్టి శ్రీరాములని డీఈఓ మాణిక్యం నాయుడు అన్నారు. మహారాజా ప్రభుత్వ సంస్కృత ఉన్నత పాఠశాల ఆవరణలో మంగళవారం పొట్టి శ్రీరాముల విగ్రహావిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 58 పాఠశాలల్లో అమరజీవి విగ్రహం ఏర్పాటు చేయడం గొప్ప విషయమన్నారు. ఎంఈఓ ఆనందమూర్తి మాట్లాడుతూ తెలుగువారికి ఆంధ్రరాష్ట్రం ప్రత్యేకంగా ఉండాలని ఆమరణ దీక్ష చేసిన మహనీయుడన్నారు. ఎంఈఓ 2వ అధికారిణి సత్యవతి పొట్టి శ్రీరాములు త్యాగ నిరతని వివరించారు. హెచ్‌ఎం లలిత విగ్రహ ఏర్పాటు చేసిన సమితి సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో సమితి వ్యవస్ధాపక అధ్యక్షుడు చెరుకూరి నాగరాజు, ముఖ్య సలహాదారు రవ్వా శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి బత్తుల కామేష్, కోశాధికారి ఆరిశెట్టి సందీప్, ఉపాధ్యక్షుడు డిమ్స్ రాజు, కోచైర్మన్ సముద్రాల నాగరాజు తదితరులు పాల్గొన్నారు.


