విజయనగరం లీగల్: రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యునిగా బెల్లాన రవి ఘన విజయం సాధించారు. ఈ మేరకు రాష్ట్ర బార్ కౌన్సిల్ మంగళవారం ప్రకటించింది. రాష్ట్ర బార్ కౌన్సిల్ ఎన్నికలు ఇటీవల జరిగిన విషయం తెలిసిందే. బెల్లాన రవి విజయనగరం న్యాయవాదుల సంఘం అధ్యక్షునిగా, జిల్లా వైఎస్సార్‌సీపీ లీగల్ సెల్ అధ్యక్షునిగా పని చేశారు. ఈయన చీపురుపల్లికి చెందిన ప్రముఖ న్యాయవాది, దివంగత బెల్లాన సింహాచలం రెండవ కుమారుడు. చీపురుపల్లిపల్లికి చెందిన బెల్లాన రవి విజయనగరం మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్‌కి స్వయానా సోదరుడు. ఈయన ఎంపిక పట్ల బార్ కౌన్సిల్ మాజీ వైస్ చైర్మన్ కోలగట్ల తమ్మన్న శెట్టి, జిల్లా వైఎస్సార్‌సీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు ఏఎన్‌వీకే అంజనీకుమార్ హర్షం వ్యక్తం చేశారు. విజయనగరం న్యాయవాదుల సంఘం అధ్యక్షులు కలిశెట్టి రవిబాబు, కార్యదర్శి నళితం సురేష్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు.
బాక్సింగ్‌లో మోడల్ స్కూల్
విద్యార్థుల సత్తా
భామిని: స్థానిక ఏపీ మోడల్ స్కూల్ విద్యార్థులు బాక్సింగ్‌లో సత్తా చాటారు. ఈ నెల 16న విశాఖపట్నంలో జరిగిన జూనియర్ బాక్సింగ్ చాంపియన్ షిప్ పోటీల్లో పలు విభాగాల్లో విజేతలుగా నిలిచారు. ఎస్.శ్రావ్య, పి.ప్రసన్న, సీహెచ్ వాహిని, సీహెచ మనీషా, డి.చందు, ఎ.అమృతవల్లి పలు స్థానాల్లో నిలిచారు. వీరిని ప్రిన్సిపాల్ బాబూరావు, పీజీటీ శివరాంప్రసాద్, కోచ్ కె.సోమేష్‌తో పాటు సిబ్బంది తదితరులు సన్మానించారు.
దుర్గాదేవి ఆలయంలో చోరీ
గుర్ల: మండలంలోని పున్నపురెడ్డిపేట దుర్గాదేవి ఆలయంలో సోమవారం అర్ధరాత్రి దొంగలు పడ్డారు. సుమారు అర తులం బంగారు, 240 గ్రాముల వెండి అభరణాలు అపహరణకు గురయ్యాయని ఆలయ ధర్మకర్త పి.రామరావు గుర్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న ఎస్‌ఐ పి.నారాయణరావు సంఘటన స్థలానికి చేరుకొని దుర్గాదేవి ఆలయాన్ని పరిశీలించారు. జిల్లా కేంద్రం నుంచి డాగ్, క్లూస్ టీంలు రంగంలోకి దిగి ఆలయ ప్రాంగణాన్ని క్షుణంగా పరిశీలించి క్లూస్ సేకరించారు. వారం రోజులు కిందట కూడా పున్నపురెడ్డిపేటలో ఒక ఇంట్లో సుమారుగా ఆరు తులాలు బంగారు అభరణాలు దొంగతనానికి గురయ్యాయి. వరుసగా జరుగుతున్న దొంగతనాలతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. దుర్గాదేవి ఆలయంలో బంగారు అభరణాలు దొంగతనంపై పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నామని ఎస్‌ఐ నారాయణరావు తెలిపారు.
ఎస్పీ ఇఫ్తార్ విందు
విజయనగరం క్రైమ్ : పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ఎస్పీ ఏఆర్ దామోదర్ ముస్లిం పోలీసు అధికారులు, సిబ్బందికి జిల్లా పోలీసు కార్యాలయంలో మంగళవారం ఇఫ్తార్ విందు ఇచ్చారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ రంజాన్ మాసం శాంతి, సహనం, సేవాభావానికి ప్రతీకని పేర్కొన్నారు. మనందరం భారతీయులమని అన్నారు. మన మధ్య కుల, మత బేధాలు లేవని, సోదర భావం మాత్రమే ఉంటుందన్నారు. ఈ సందర్భంగా ముస్లిం పోలీసు అధికారులు, సిబ్బంది ఎస్పీని వారి మత సాంప్రదాయం ప్రకారం సత్కరించారు. అనంతరం ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎస్పీ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


