జామి: ఉపాధి హామీ పథకాన్ని బీజేపీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు. జామిలో ఎస్.కోట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ గేదెల తిరుపతి ఆధ్వర్యంలో ఉపాధి హామీ పరిరక్షణ యాత్రలో భాగంగా మంగళవారం రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం ఉపాధి హామీ పేరు మార్చిందన్నారు. వేతనదారులకు అన్యాయం చేసిందన్నారు. ఎక్కడ కూడా వంద రోజుల పనిదినాలు కల్పించడం లేదని, చేసిన పనులకు సకాలంలో బిల్లులు చెల్లించడం లేదని ధ్వజమెత్తారు. ఉపాధి పనులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం భరించాలని బీజేపీ ప్రభుత్వం చెప్పడం కేవలం పథకాన్ని నీరుగార్చడమేనని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఫ్రీ బస్సుల పుణ్యమా అని విద్యార్థులకు బస్సులు ఆపడం లేదన్నారు. పలువురు విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంటు విడుదల చేయడం లేదని దీంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. తాండ్రంగి, విజినిగిరి తదితర గ్రామాలకు బస్సులు లేవని కళాశాలలకు వెళ్లాలంటే నానా అవస్థలు పడుతున్నామని విద్యార్థులు చెప్పడంతో బస్సులు లేకుండా ఫ్రీ బస్సు పథకం ఎందుకని ప్రశ్నించారు. చంద్రబాబు సూపర్ సిక్స్ పథకంలో నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవని ధ్వజమెత్తారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు కూటమిలోని నేతలు ఇచ్చిన హామీలు మరచిపోయారన్నారు. ఎస్.కోట మండలంలో జిందాల్ కంపెనీ బాధిత రైతులను మోసం చేసిందన్నారు. జామిలో ఇనాం భూముల సమస్య తీవ్రంగా ఉందని, రైతులు ఇబ్బందులు పడుతున్నామని షర్మిలకు తెలిపారు. కలెక్టర్‌తో ప్రత్యేకంగా మాట్లాడతానని, కాంగ్రెస్ పార్టీ తరఫున సీఎంకు లేఖ రాస్తానని చెప్పారు. కేంద్ర మాజీ మంత్రి జేడీ శీలం, జిల్లా పార్టీ అధ్యక్షుడు ఎం.విద్యాసాగర్, విద్యార్థి విభాగం అధ్యక్షుడు సుంకరి గణేష్ తదితరులు పాల్గొన్నారు.
ఏపీసీసీ చీఫ్ షర్మిల


