విజయనగరం టౌన్: కెఎన్‌వై.పతంజలి సాహితీ పురస్కారానికి ఈ ఏడాది ప్రముఖ సీ్త్రవాద రచయిత్రి కుప్పిలి పద్మని ఎంపిక చేసినట్టు పతంజలి సాంస్కృతిక వేదిక అధ్యక్షుడు భీశెట్టి బాబ్జి పేర్కొన్నారు. ఈ మేరకు గురజాడ స్వగృహంలో మంగళవారం నిర్వహించిన సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఈ నెల 29న గురజాడ కేంద్ర గ్రంథాలయంలో నిర్వహించే పతంజలి జయంతి కార్యక్రమంలో పురస్కారాన్ని ఆమెకు ప్రదానం చేస్తామన్నారు. ఇప్పటివరకూ మోహన్, దేవీప్రియ, సతీష్ చందర్, జిఆర్.మహర్షి, గంటేడ గౌరునాయుడు, అట్టాడ అప్పలనాయుడు, చింతకింది శ్రీనివాసరావు, రౌతు బంగారునాయుడు, అరుణ పప్పు, తాడి ప్రకాష్‌లకు అందజేశామన్నారు. ఈ ఏడాది కుప్పిలి పద్మను కమిటీ ఎంపిక చేసిందన్నారు. ఆమె వార్తలో మైదానం శీర్షికన సమకాలీన అంశాలపై స్పందించిన తీరు తెలుగు విమర్శకుల ప్రశంసలు అందుకున్నారన్నారు. సుమారు 159 కథలు రాశారన్నారు. వాటిలో ఆరు నవలలు ఉన్నాయని, ప్రధానంగా కరోనా సమయంలో మళ్లీ తేయాకు తోటలోకి పేరిట కార్మికుల జీవితాల్లోని ఒడిదుడుకులను చాలా హృద్యంగా రచించారన్నారు. ఆమె ప్రతిభా పాటవాలకు గుర్తుగా ఎన్నో అవార్డులు ఆమెను వరించాయన్నారు. పద్మ మన ఉత్తరాంధ్రాకు చెందిన ప్రముఖ మహిళా రచయిత్రి కావడం మరింత గర్వకారణమన్నారు. సమావేశంలో వేదిక కార్యదర్శి ఎన్‌కె.బాబు, ప్రతినిధులు విఎమ్‌కె.లక్ష్మణరావు, బి.నాగేంద్రప్రసాద్, పి.ప్రభాకరరావు, జలంత్రి రామచంద్ర, తాడేపల్లి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.


