సీతంపేట: టీటీడీ చైర్మన్ బీఆర్‌నాయుడు వెంటనే తన పదవి నుంచి వైదొలగాలంటూ మహిళలు తిరుపతిలో ఆయన బస చేసిన హోటల్ వద్ద నిరసన వ్యక్తం చేస్తే టీడీపీ గుండాలతో దాడి చేయించడం ఎంతవరకు సమంజసమని పాలకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు పార్టీ నాయకులతో కలసి అంబేడ్కర్ చిత్ర పటం వద్ద ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. కళంకితుడిగా తేలినా ప్రశ్నిస్తే దాడిచేయడం, విజిలెన్స్ వారితో బెదిరించడం, ఇంకా కేసులు పెట్టడం, పదవి పట్టుకుని వ్రేలాడడం, జాతీయ మీడియా ఏకి పారేస్తున్నా చంద్రబాబులో మాత్రం ఎటువంటి చలనం లేకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. తిరుమల పవిత్రతను కాపాడుకోవాల్సిన సమయం ఇదేనని వెంటనే బీఆర్ నాయుడుని టీడీడీ చైర్మన్ పదవి నుంచి తొలగించాలన్నారు. అడ్డంగా వీడియో, ఫొటోలతో దొరికిపోయినా నిస్సిగ్గుగా మళ్లీ తిరుమలకు వచ్చి వెంకటేశ్వరస్వామి క్షేత్రాన్ని అపవిత్రం చేస్తున్నాడన్నారు. చంద్రబాబు ప్రోత్సాహంతోనే ఇవన్నీ జరుగుతున్నాయన్నారు. తనను లైంగికంగా వేధిస్తున్నారని ఇలాంటి వ్యక్తికి ఎటువంటి బాధ్యతలు ఇవ్వొద్దని, ఒక మహిళ స్వయంగా గతంలో పూర్తి వివరాలతో లేఖ రాసినా చంద్రబాబు పట్టించుకోలేదన్నారు. కార్యక్రమంలో పలువురు వైఎస్సార్‌సీపీ నాయకులు పాల్గొన్నారు.


