టీటీడీ చైర్మన్‌ను పదవి నుంచి తొలగించాలంటూ విజయనగం అంబేడ్కర్ విగ్రహం వద్ద
వైఎస్సార్‌సీపీ శ్రేణుల నిరసన
రాష్ట్రంలో అంబేడ్కర్ రాజ్యాంగం కాకుండా, రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ చంద్రబాబు ప్రభుత్వం అరాచక పాలన సాగిస్తోంది. పవిత్రమైన టీటీడీ పాలకమండలి చైర్మన్ పదవిలో ఉన్న బీఆర్ నాయుడు ఆశ్లీల పనులకు పాల్పడుతుంటే తిరుపతికి వెళ్లే మహిళా భక్తులకు ఏ విధంగా రక్షణ కల్పిస్తారు. సనాతన ధర్మమంటూ గొప్పలుచెప్పే డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఈ విషయంపై ఎందుకు స్పందించడం లేదు. అశ్లీల పనులు, అక్రమాలు చేసే వారికి పదవులు కట్టబెట్టడం ఎంత వరకు సమంజసం. టీటీడీ చైర్మన్‌పై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా బాధ్యతగల ప్రతిపక్షంగా వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో పోరాటం చేస్తున్నాం. ప్రజల ఓట్లతో గెలిచిన ప్రజాప్రతినిధులు మేలుచేయకపోగా ఎన్నికలకు ముందు ప్రకటించిన హమీలు తుంగలోకి తొక్కుతున్నారు. ప్రభుత్వం చేస్తున్న తప్పులపై ప్రశ్ని స్తే భయబ్రాంతులకు గురిచేసి జైల్లో పెట్టిస్తున్నారు. అలాంటి వాటికి వైఎస్సార్‌సీపీ శ్రేణులు భయపడే ప్రసక్తే లేదు. రానున్నరోజుల్లో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టి ప్రజలతోనే తగిన బుద్ధిచెప్పిస్తాం.
– కోలగట్ల
వీరభద్రస్వామి,
ఏపీ శాసనసభ మాజీ డిప్యూటీ స్పీకర్,
వైఎస్సార్‌సీపీ కేంద్ర కమిటీ సభ్యుడు
విజయనగరం:
రాష్ట్రంలోని కళంకిత పాలనపై విజయనగర ప్రజలు ఆగ్రహం వ్యక్తంచేశారు. కోట్లాది మంది ప్రజల ఆరాధ్యదైవం తిరుమల వేంకటేశ్వరస్వామి ప్రతిష్టను దిగజార్చేలా, భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా అశ్లీల వీడియోలతో అడ్డంగా దొరికిపోయిన టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుని తక్షణమే పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. టీటీడీ చైర్మన్‌కు వ్యతిరేకంగా తిరుపతిలో ఆందోళన చేసిన మహిళలపై టీడీపీ గూండాల అరాచకత్వంపై నిరసన గళం వినిపించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, ఏపీ శాసనసభ మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి ఆధ్వర్యంలో విజయనగరం బాలాజీ కూడిలిలోని అంబేడ్కర్ విగ్రహం సాక్షిగా మంగళవారం ధర్నాచేశారు. చంద్రబాబు ప్రభుత్వ తీరును దుమ్మెత్తిపోశారు. సీఎం డౌన్ డౌన్... ప్రశ్నించే గొంతులపై దాడులు ఆపాలి... టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడును తొలగించాలంటూ పెద్దఎత్తు నినాదాలు చేశారు. ప్లకార్డులు ప్రదర్శించారు. అనంతరం భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో నగర మేయర్ వెంపడాపు విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణి, జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు గదుల సత్యలత, అంగన్‌వాడీ విభాగం అధ్యక్షురాలు పతివాడ కృష్ణ వేణి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె.వి.సూర్యనారాయణరాజు, కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ శెట్టివీరవెంకట రాజేష్, ఎంపీపీ మామిడి అప్పలనాయుడు, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి సంగంరెడ్డి బంగారునాయుడు, జిల్లా యువజన విభాగం నాయకుడు జి.ఈశ్వర్‌కౌశిక్, విజయనగరం నగర పార్టీ అధ్యక్షుడు ఆశపు వేణు, జిల్లా ఎస్సీసెల్ అధ్యక్షుడు పీరుబండి జైహింద్‌కుమార్, పెన్షనర్లు/ ఉద్యోగుల విభాగం అధ్యక్షుడు డోల మన్మథకుమార్, నెల్లిమర్ల నగర పంచాయతీ వైస్‌చైర్మన్ సముద్రపు రామారావు, జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు అల్లు అవినాష్, విద్యార్థి విభాగం అధ్యక్షుడు కరుమజ్జి సాయికుమార్, పార్టీ నాయకులు గొర్లె రవికుమార్, కనకల రఘురామారావు, తదితరులు పాల్గొన్నారు.
కళంకిత పాలనపై
ప్రజాగ్రహం
అడ్డంగా దొరికిపోయి సిగ్గుమాలిన మాటలా?
అశ్లీల వీడియోలతో అడ్డంగా దొరికిపోయిన బీఆర్ నాయుడు... తొలుత ఆయనపై వచ్చినవి ఫేక్ వీడియోలని, అనంతరం ఏఐలో మార్పు చేసినవని, ఆ తరువాత అందులో తప్పేముందంటూ మాట్లాడటం సిగ్గుచేటు. బీఆర్ నాయుడు అశ్లీలత పనులతో తిరుపతి ప్రతిష్టను దిగజార్చడంతో పాటు భక్తుల మనోభావాలను దెబ్బతీశారు. జరిగిన ఘటనపై సరైన వివరణ ఇవ్వకుండా తప్పించుకుని తిరుగుతున్న టీటీడీ చైర్మన్ సోమవారం తిరుపతికి వచ్చిన సందర్భంలో వైఎస్సార్‌సీపీ మహిళా నాయకులు ప్రశ్నించేందుకు వెళ్తే వారిపైకి టీడీపీ గూండాలను ఉసిగొల్పి దాడులు చేయించడం, అక్రమ కేసులు బనాయించి పీడీయాక్టు పెట్టడం చంద్రబాబు ప్రభుత్వ అరాచక పాలనకు అద్దంపడుతోంది. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన పోలీసులు ఇలా వ్యవహరించడం దారుణం. రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాస్తున్నారు. టీటీడీ చైర్మన్‌పై తక్షణమే చర్యలు తీసుకోవాలి. టీటీడీ ప్రతిష్టను కాపాడాలి. అప్పటి వరకు ప్రజల పక్షాన పోరాటం చేస్తాం. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక హిందూదేవాలయాలకు రక్షణ కరువైంది. రెండేళ్లలో హిందువులపై దాడులు పెరిగాయి. గంజాయి, డ్రగ్స్ వాడకం పెరిగింది. టీడీపీకి చెందిన ఎంపీ డ్రగ్స్ తీసుకుంటూ దొరికిపోయినా చర్యలు తీసుకునే పరిస్థితి లేదు. – మజ్జిశ్రీనివాసరావు,
జెడ్పీ చైర్మన్, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు
వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో గర్జించిన జనం
టీటీడీ చైర్మన్ పదవికి బీఆర్ నాయుడు అనర్హుడు
అశ్లీల చర్యలతో టీటీడీ ప్రతిష్టను దెబ్బతీశారు
చర్యలు తీసుకోవడంలో చంద్రబాబు ప్రభుత్వం తాత్సారం తగదు
తప్పులను ప్రశ్నించే వారిపై దాడులు, అక్రమ కేసులు, పీడీయాక్టు
టీటీడీ చైర్మన్‌ను తొలగించేంత వరకు పోరాటం
జెడ్పీ చైర్మన్, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు
తిరుపతిలో వైఎస్సార్‌సీపీ మహిళలపై దాడికి వ్యతిరేకంగా నిరసన


