పాసుపుస్తకాల పంపిణీ వేగంగా పూర్తికావాలి | - | Sakshi
Sakshi News home page

పాసుపుస్తకాల పంపిణీ వేగంగా పూర్తికావాలి

Mar 18 2026 7:33 AM | Updated on Mar 18 2026 7:33 AM

కలెక్టర్‌ ఎస్‌.రాంసుందర్‌ రెడ్డి

విజయనగరం: జిల్లాలో పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీని వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్‌ ఎస్‌.రాంసుందర్‌ రెడ్డి ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్‌, ఇతర ఉన్నతాధికారులు మంగళవారం రాష్ట్ర సచివాలయం నుంచి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. పట్టాదారు పాసుపుస్తకాలు, రీసర్వే, 22 ఏ భూములు, తదితర రెవెన్యూ అంశాలపై దిశానిర్దేశం చేశారు. జిల్లాలోని పరిస్థితులను సీఎస్‌కు కలెక్టర్‌ వివరించారు. ఈ వీసీ అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రతినెలా 9వ తేదీలోగా నిర్దేశించిన పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీని పూర్తిచేయాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. మ్యుటేషన్లను వీలైనంత వేగంగా వేగంగా పూర్తి చేయాలని సూచించారు. సమావేశంలో జేసీ ఎస్‌.సేతుమాధవన్‌, డీఆర్వో సీహెచ్‌ సత్తిబాబు, ఆర్డీఓలు వెంకటేశ్వరరావు, సుధారాణి, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.

న్యూరోసర్జరీ పరికరంపై పరిశోధనకు గుర్తింపు

విజయనగరం ఫోర్ట్‌: అధునాతన న్యూరోసర్జరీ పరికరంపై పరిశోధనకు ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి న్యూరోసర్జరీ విభాగం అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ రెడ్డి శంకరరావు, వైద్య కళాశాల ఎంబీబీఎస్‌ విద్యార్థి వి. డానీకి గుర్తింపు లభించింది. ఈ నెల 16న విశాఖపట్నంలోని గీతం మెడికల్‌ కాలేజీలో జరిగిన సమ్మిట్‌లో సమర్పించిన ‘ సర్టన్‌ లెడ్‌ నోవెల్‌ క్రానియోటోట్‌ అడాప్టర్‌ టు కన్వర్ట్‌ సర్టిఫైడ్‌ ఇంటి/డెంటల్‌ డ్రిల్‌ సిస్టమ్‌ ఆన్‌ ఎ న్యూరోసర్జరీ డ్రిల్‌ సిస్టం’ అనే విన్నూత పరిశోధన పత్రానికి ద్వితీయస్థానం లభించింది. రూ.34 వేలు నగదు లభించింది. పరిశోధకులను స్థానిక ప్రభుత్వ వైద్య కళాశాలలో ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ బి.దేవీమాధవి, వైస్‌ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ లోక్‌నాఽథ్‌, సర్వజన ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ అల్లు పద్మజ అభినందించారు.

నేటి నుంచి ప్రత్యేక

అధికారుల పాలన

ముగిసిన కార్పొరేషన్‌ పాలకవర్గం పదవీ కాలం

విజయనగరం: విజయనగరం మున్సిపల్‌ కార్పొరేషన్‌లో బుధవారం నుంచి ప్రత్యేక అధికారి పాలన ప్రారంభం కానుంది. ప్రస్తుత పాలకవర్గం పదవీకాలం మంగళవారంతో ముగియనుంది. బుధవారం నుంచి కార్పొరేషన్‌ ప్రత్యేకాధికారిగా కలెక్టర్‌ రామ సుందర్‌ రెడ్డి వ్యవహరించనున్నారు. కార్పొరేషన్‌ ఎన్నికలు జరిగేంత వరకు ప్రత్యేకాధికారుల పర్యవేక్షణలో పాలన సాగనుంది.

విజయనగరం ఆర్డీఓగా సుధాసాగర్‌

విజయనగరం: విజయనగరం రెవెన్యూ డివిజనల్‌ అధికారిగా సనపల సుధాసాగర్‌ నియామకమయ్యారు. ఈ మేరకు మంగళవారం ప్రభుత్వ చీఫ్‌ సెక్రటరీ జి.సాయిప్రసాద్‌ ఉత్తర్వులు జారీ చేశారు. విశాఖ స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న ఆయనను ఆర్డీఓగా బాధ్యతలు అప్పగించారు. ఇప్పటివరకు ఆర్డీఓ గా ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ వెంకటేశ్వరరావు బాధ్యతలను నిర్వహించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా విజయనగరం ఫారెస్ట్‌ సెటిల్మెంట్‌ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తున్న ఎం.నూకరాజును అల్లూరి సీతారామరాజు జిల్లా రెవెన్యూ అధికారిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. నూకరాజు నెల రోజుల వ్యవధిలో ఉద్యోగ విరమణ పొందనున్నారు.

ఫైర్‌ ఆఫీసర్‌కు ఉగాది పురస్కారం

విజయనగరం క్రైమ్‌: విశిష్టసేవలందించే వారికి రాష్ట్ర ప్రభుత్వం ఏటాఇచ్చే ఉగాది పురస్కారానికి ఉమ్మడి విజయనగరం జిల్లా అగ్నిమాపక ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు రమేష్‌ ఎంపికయ్యారు. ప్రస్తుతం ఆయన పార్వతీపురం అగ్నిమాపక కేంద్రం అధికారిగా పనిచేస్తున్నారు. విధి నిర్వహణలో అంకిత భావం, సేవను ప్రోత్సహిస్తూ ప్రభుత్వం ఇచ్చే పురస్కారానికి రమేష్‌ ఎంపిక కావడంపై ఆ శాఖ ఉద్యోగులు హర్షం వ్యక్తంచేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement