విజయనగరం అర్బన్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ‘దివ్యాంగ శక్తి’ పథకం బుధవారం నుంచి అమలులోకి వస్తుందని జిల్లా ప్రజారవాణా అధికారి జి.వరలక్ష్మి తెలిపారు. ఈ పథకం కింద సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్, పల్లె వెలుగు, ఆల్ట్రా పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్ సర్వీసుల్లో దివ్యాంగులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామన్నారు. 40 శాతం, అంతకంటే ఎక్కువ దివ్యాంగత్వం కలిగిన ఆర్థో, మూగ, చెవిటి, అంధులు, మరుగుజ్జులు, కుష్టు, మానసిక రోగులు, వణుకుడు వ్యాధిగ్రస్తులు, తలసేమియా తదితర 21 రకాల వ్యాధులు కలిగిన వారు ఈ సదుపాయం పొందవచ్చన్నారు. ఇంటర్‌స్టేట్, ఆల్ట్రాడీలక్స్, సప్తగిరి బస్సుల్లో దివ్యాంగులకు 50 శాతం రాయితీ ఇవ్వనున్నారు. వంద శాతం అంధులు, ఐక్యూ 69 లోపు ఉన్న మానసిక దివ్యాంగులకు సహాయకుడు (ఎస్కార్టు)కు కూడా 50 శాతం రాయితీ వర్తిస్తుంది. మూగ, చెవిటి దివ్యాంగులకు ఎస్కార్టు సౌకర్యం ఉండదు. ఉచిత లేదా రాయితీ ప్రయాణం పొందేందుకు దివ్యాంగులు సంబంధిత సదరం సర్టిఫికెట్‌తో పాటు ఆర్టీసీ జారీచేసిన బస్సుపాస్‌ను చూపించాల్సి ఉంటుంది. ఉచిత టికెట్, ఎస్కార్టు టికెట్ వేర్వేరుగా జారీ చేస్తామని జిల్లా ప్రజారవాణా అధికారి తెలిపారు.


