సూఫీ సుగంధ మహోత్సవాలు ప్రారంభం
● వందలాది మంది భక్తులకు
అన్నప్రసాదం పంపిణీ
● ఖాదర్‌బాబా చిత్రపటంతో భారీ
ఊరేగింపు నేడు
విజయనగరం టౌన్: బాబామెట్టలో ఉన్న ఆధ్యాత్మిక సూఫీ చక్రవర్తి హజరత్ సయ్యద్ షహిన్ షా బాబా ఖాదర్‌వలీ బాబా 67వ సూఫీ సుగంధ ఉరుసు మహోత్సవాలను గురువారం భక్తిశ్రద్ధలతో అంగరంగ వైభవంగా ప్రారంభించారు. దర్బార్ నిర్వాహకులు ముతవల్లి డాక్టర్ ఖలీలుల్లా షరీఫ్, సూఫీ ీపీఠాధిపతి ఖ్వాజా మొహియుద్దీన్‌ల ఆధ్వర్యంలో వందలాది మంది భక్తుల సమక్షంలో దర్గాలో ఖురాన్ పఠనంతో ఉరుసు ఉత్సవాలను ప్రారంభించారు. రాత్రి బాబావారికి శుద్ధిస్నానం (గుషుల్) నిర్వహించారు. లంగర్ ఖానాలో ప్రత్యేక ప్రార్థనల అనంతరం భక్తులకు అన్నప్రసాదాన్ని వడ్డించారు. ఈ సందర్భంగా దర్బార్ నిర్వాహకులు మాట్లాడుతూ ఉత్సవాల మూడురోజుల పాటు అన్నసమారాధన నిర్విరామంగా కొనసాగుతుందని చెప్పారు. శుక్రవారం ఉదయం 10 గంటలకు ఉత్సవంలో ప్రధాన ఘట్టమైన సందల్ అంటే బాబా చిత్రపటంతో ఊరేగింపు నగరవీధుల్లో సందడిగా జరుగుతుందన్నారు. ఊరేగింపు తర్వాత దర్గాపై బాబావారికి సుగంధ, చాదర్, పరిమళ ద్రవ్యాల సమర్పణ చేస్తామని చెప్పారు. మూడురోజుల పాటు భక్తులందరికీ బాబా వారి శేష వస్త్రాలు, తబురుక్ (ప్రసాదం) పంపిణీ కార్యక్రమాలతో ఉత్సవాలు ముగుస్తాయని వివరించారు.
సూఫీ సుగంధ మహోత్సవాలు ప్రారంభం


