విశ్రాంత ఉద్యోగులకుట్రెజరీ తిప్పలు
రాజాం:
ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగులకు రాజాం సబ్‌ట్రెజరీ కార్యాలయ ఉద్యోగులు చుక్కలు చూపిస్తున్నారు. ఐటీ చెల్లింపుల్లో జాప్యం చేస్తూ వృద్ధులను ముప్పుతిప్పలు పెడుతున్నారు. ఓ విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు ఉన్నతాధికారులకు సోమవారం ఫిర్యాదు చేయడంతో సబ్‌ట్రెజరీలోని లోపాలు వెలుగుచూశాయి.
● ఐటీ నిధులు గోల్‌మాల్
రాజాం సబ్ ట్రెజరీ కార్యాలయంలో శ్రీకాకుళానికి చెందిన విశ్రాంత హెచ్‌ఎం ఉత్తరావిల్లి నాగేశ్వరరావుకు ఉన్న ఖాతా నుంచి కొద్దినెలల కిందట ఇన్‌కంట్యాక్స్ నిమిత్తం రూ.8,224లు కట్‌చేశారు. ఈ నగదు సబ్‌ట్రెజరీ కార్యాలయం నుంచి ఇన్‌కమ్ ట్యాక్స్‌కు చెల్లించడంలో నిర్లక్ష్యం చేశారు. దీంతో నెలరోజుల కిందట ఇన్‌కంట్యాక్స్ ప్రధాన కార్యాలయం నుంచి ఆదాయపు పన్ను చెల్లించలేదని విశ్రాంత హెచ్‌ఎంకు నోటీసులు వచ్చాయి. దీంతో కంగుతున్న ఆయన సబ్‌ట్రెజరీ అధికారి రమేష్‌ను సంప్రదించారు. రోజులు గడుస్తున్నా సమస్య పరిష్కరించలేదు. దీంతో విసిగిపోయిన ఆయన రెండు రోజుల కిందట సబ్‌ట్రెజరర్ ఉన్నతాధికారులకు ఫిర్యాదుచేశారు. ఈ విషయం మీడియాకు రావడంతో అప్రమత్తమై నాగేశ్వరరావును సంప్రదించారు. టెక్నికల్ సమస్య కారణంగా చెల్లింపులు జరుగలేదని, గడువుకావాలని కోరారు. దీనికి ఆయన ససేమిరా అనడంతో సాయంత్రం 5 గంటల వరకూ కార్యాలయంలో కూర్చుని చెల్లింపులు చేశారు. చాలామంది విశ్రాంత ఉద్యోగులను ఇదే సమస్య వెంటాడుతోందని, వివిధ పనుల నిమిత్తం కార్యాలయ సిబ్బంది మామ్మూళ్లు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
టెక్నికల్ సమస్య
రాజాం సబ్ ట్రెజరీ కార్యాలయంలో పెన్షనర్లను ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదు. నాగేశ్వరరావు సమస్య టెక్నికల్‌తో కూడుకున్నది. మా సిబ్బంది నిర్లక్ష్యం వల్ల జరిగింది. వెంటనే సరిచేస్తాం.
– ఐ.రమేష్, సబ్‌ట్రెజరీ ఆఫీసర్, రాజాం
తిరిగితిరిగి అలసిపోయాను
రాజాం సబ్ ట్రెజరీ కార్యాలయంలో చాలా సమస్యలు ఉన్నాయి. అక్కడి అధికారి, సిబ్బంది సరిగ్గా స్పందించరు. నా బ్యాంకు ఖాతా నుంచి ఐటీ చెల్లింపులు నిమిత్తం రూ. 8,224లు నగదు కట్ చేశారు. తరువాత ఐటీకి చెల్లించకుండా మాయంచేశారు. చాలాసార్లు కార్యాలయానికి తిరిగితిరిగి అలసిపోయాను. మధ్యాహ్నం 3 గంటల తరువాత అక్కడ ఎవరూ ఉండరు. అడిగినంత డబ్బులు ఇస్తేనే పనవుతుంది. ఈ బాధలు పడలేక ట్రెజరీ ఖాతాను శ్రీకాకుళం మార్చుకున్నాను. నాలాగే చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఉన్నతాధికారులు ఇక్కడ కార్యాలయం తీరుపై దృష్టిసారించి, ఆకస్మిక తనిఖీలు చేయాలి.
– ఉత్తారావిల్లి నాగేశ్వరరావు, విశ్రాంత హెచ్‌ఎం, శ్రీకాకుళం
రాజాం సబ్ ట్రెజరీలో కిరికిరి
ఓ రిటైర్డ్ హెచ్‌ఎం ఐటీ నగదు
చెల్లింపులో దోబూచులాట
మూడునెలలుగా ముప్పుతిప్పలు
ఉన్నతాధికారులకు ఫిర్యాదుతో
వెలుగులోకి..


