అమ్మరాకతో పులకించిన శంబర
● చదురుగుడికి చేరుకున్న శంబర పోలమాంబ అమ్మవారు
● శంబరలో జాతర శోభ
మక్కువ:
ఉత్తరాంధ్రుల ఇలవేల్పు శంబరపోలమాంబ అమ్మవారు శంబర గ్రామంలోని చదురుగుడికి సోమవారం చేరుకున్నారు. అమ్మరాకతో శంబరంతా సంబరం కనిపించింది. గోముఖి ఆవలి ఒడ్డునున్న అమ్మవారి గద్దె వద్ద ఘటాలకు పూజారి, కుప్పిల, గిరడ, పూడి, కరణం, మున్సబ్ కుటుంబాల వారు, గ్రామ పెద్దలు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అమ్మవారి ఘటాలను మేళతాళాలు, కోలాటం, థింసానత్యం, తప్పిటగుళ్లు, బాణసంచా, భక్తులు జయజయ ధ్వానాల మధ్య గ్రామంలోకి తీసుకొచ్చారు. అమ్మవారి ఘటాలను చూసి భక్తులు పరవశించిపోయారు. ఘటాలకు ఎదురెళ్లి పసుపు, కుంకుమలు సమర్పించారు. ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారి రాకతో గ్రామానికి జాతర శోభ సంతరించుకుంది. అమ్మవారికి కాళ్లనొప్పులు కారణంగా మంగళవారం విశ్రాంతి తీసుకుని బుధవారం నుంచి చదురుగుడిలో 13 రోజులపాటు భక్తులకు దర్శనమిస్తారు. ప్రతిరోజు సాయంత్రం నుంచి రాత్రి వరకు అమ్మవారి ఘటాలకు గ్రామంలోని అన్ని వీధులలో తిరువీధి నిర్వహిస్తారు. ఈ నెల 26న తొలేళ్ల ఉత్సవం, 27న సిరిమానోత్సవం, 28న అనుపోత్సవం నిర్వహిస్తారు. ఫిబ్రవరి 3న మారుజాతర సాగుతుంది. పదివారాల పాటు అమ్మవారి జాతర నిర్వహిస్తారు. కార్యక్రమంలో ట్రస్టుబోర్డు చైర్మన్ నైదాన తిరుపతిరావు, కమిటీ సభ్యులు, ఆలయ ఈఓ బి.శ్రీనివాస్, ఎంపీటీసీ సభ్యుడు టి.పోలినాయుడు, ఉప సర్పంచ్ అల్లు వెంకటరమణ, గ్రామ పెద్దలు, భక్తులు పాల్గొన్నారు.
అమ్మరాకతో పులకించిన శంబర
అమ్మరాకతో పులకించిన శంబర
అమ్మరాకతో పులకించిన శంబర


