కోడి పందాలు నిర్వహిస్తే ఖబడ్డార్
● ఎస్పీ దామోదర్
విజయనగరం క్రైమ్: కోడి పందాలు నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ దామోదర్ సోమవారం ఓ ప్రకటనలో హెచ్చరించారు. ప్రజలు చట్టవ్యతిరేక కార్యకలాపాలైన కోడి, పొట్టేలు పోటీలు, పేకాటకు దూరంగా ఉండాలన్నారు. గతంలో పేకాట, కోడి పందాలతో ప్రమేయం ఉన్న 80 మందిని గుర్తించి బైండోవర్ చేశామన్నారు. సంప్రదాయ పద్ధతిలో సంక్రాంతి జరుపుకోవాలని, క్షేత్ర స్థాయిలో కోడి, పొట్టేలు పందాలు, పేకాట నిర్వహించే ప్రాంతాలను డ్రోన్లతో పర్యవేక్షిస్తున్నామన్నారు. కోడి పందాల నియంత్రణకు హైకోర్టు ఆదేశాలతో మండల స్థాయిలో రెవెన్యూ, స్థానిక పోలీసులు, జంతు సంరక్షణ కమిటీ సభ్యులతో ప్రత్యేకంగా కమిటీలను ఏర్పాటు చేశామని తెలిపారు.
తప్పులులేని పట్టాదారు
పాసుపుస్తకాలు పంపిణీ చేయాలి
● కలెక్టర్ ఎస్.రాంసుందర్‌రెడ్డి
విజయనగరం అర్బన్: జిల్లాలో ఉన్న జాయింట్ ఎల్‌పీఎంలను పూర్తిగా తొలగించి ఎటువంటి తప్పులులేని పట్టాదారు పాసుపుస్తకాలను వేగంగా పంపిణీ చేయాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. జాయిట్ కలెక్టర్ ఎస్.సేతుమాధవన్‌తో కలిసి రెవెన్యూ అధికారులతో సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ, రెవెన్యూ క్లినిక్, ఐవీఆర్‌ఎస్ సర్వే తదితర అంశాలపై సమీక్షించారు. జిల్లాలో పాసుపుస్తకాల పంపిణీ ఆశించిన స్థాయిలో జరగడం లేదని, ఐవీఆర్‌ఎస్ సర్వేలో కూడా వివిధ అంశాలపై జిల్లా ప్రజలు అసంతప్తి వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. జేసీ ఎస్.సేతుమాధవన్ మాట్లాడుతూ జాయింట్ ఎల్‌పీఎంలను సరిదిద్దేందుకు ప్రభు త్వం తహసీల్దార్లకు ప్రత్యేక అవకాశం కల్పించిందన్నారు. తప్పులను సరిచేసుకునేందుకు మంచి అవకాశమని, ఎలాంటి లోపాలు లేకుండా రైతులకు పాసుపుస్తకాల అందించాలని ఆయన ఆదే శించారు. జిల్లాలోని 423 గ్రామాలకు సంబంధించి సుమారు 1.54 లక్షల పట్టాదారు పాసుపుస్తకాలను పంపిణీ చేయాల్సి ఉందని జేసీ తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్‌లో డీఆర్వో మురళి, ఆర్డీఓలు దాట్ల కీర్తి, రాంమోహన్, సత్యవాణి, తహసీల్దార్లు, ఇతర రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
‘పల్లవి’ంచిన ప్రతిభ
జామి: గతేడాది డిసెంబర్ 27న నిర్వహించిన ఎడ్యుకేషనల్ ఎపిఫనీ మెరిట్ టెస్ట్ (ఈఈఎంటీ)లో కుమరాం జెడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన 10వ తరగతి విద్యార్థిని పొన్నగంటి పల్లవి జిల్లా ఫస్ట్ సాధించినట్టు పాఠశాల హెచ్‌ఎం బాబులాల్ తెలిపారు. రూ.12వేల నగదు ప్రోత్సాహం అందజేశారన్నారు. విద్యార్థినిని హెచ్‌ఎంతో పాటు పాఠశాల ఉపాధ్యాయ సిబ్బంది అభినందించారు.
కోడి పందాలు నిర్వహిస్తే ఖబడ్డార్


