మయన్మార్‌లో చిక్కుకున్న యువకులకు విముక్తి
విజయనగరం అర్బన్: ఉద్యోగాల పేరుతో మయన్మార్‌కు వెళ్లి మోసపోయిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన 27 మంది యువకులు సురక్షితంగా భారతదేశానికి చేరుకున్నారు. మయన్మార్‌లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న తమ పరిస్థితిని వీడియో రూపంలో కేంద్ర పౌర విమానయాన మంత్రికి పంపించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. కొద్ది నెలల కిందట మంచి ఉపాధి హామీతో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన యువకులు మయన్మార్‌కు వెళ్లారు. అయితే అక్కడ వారికి ఇచ్చిన హామీలు అమలు కాకపోవడమే కాకుండా బలవంతపు సైబర్ స్కామ్ కార్యకలాపాల్లో పాల్గొనాల్సి వచ్చిందని, శారీరక వేధింపులకు గురయ్యామని బాధితులు వెల్లడించారు. తప్పుడు వాగ్దానాలతో తమను అక్కడికి తీసుకెళ్లి, సరిహద్దుల్లో ట్రాఫికింగ్‌కు గురి చేశారని వారు వాపోయారు. తమ కష్టాలను వీడియో రూపంలో చెప్పుకోవడంతో స్పందించిన కేంద్ర ప్రభుత్వ విదేశాంగ శాఖ మంత్రిత్వ శాఖ మయన్మార్‌లో చిక్కుకున్న 27 మంది భారతీయులను సురక్షితంగా స్వదేశానికి తీసుకొచ్చింది. దీంతో ఆదివారం ఉదయం బాధితులు సురక్షితంగా న్యూఢిల్లీకి చేరుకున్నారు. తిరిగి దేశానికి వచ్చిన వారిలో రాము గున్నుగుకెళ్లి, సాయికుమార్ కనకవల, అజయ్ దుబ్బా, జగదీశ్ సాహు, బ్రహ్మాజీ అలుగోలు, భువనేష్ గండబోయిన, దినేష్ గండబోయిన, ధనుంజయరావు గువ్వల, చిను దీపక్ మెరదబూడి, శ్రీహర్హ అల్లు, జయకృష్ణ చటాల, జి.రామకృష్ణ, ఎస్.ఎ.నజ్మాబేగం, అరునేంద్ర మఠి, మస్తాన్ గగ్గుతూరి, జస్వంత్‌కుమార్ రెడ్డి, చైతన్యకుమార్ రెడ్డి, జాయ్ విఘ్నాన్ సలగల, విజయ్‌కుమార్ ఇసుకపాటి, సాయి నికేష్ దేవర, రమేష్ పల్లెబోన, రాకేష్ మంటి, తేజశ్వితుంగ, మురళి, బి.చిన్నమల్లయ్య, ఎం.సుమలక్ష్మి, జె.శేఖర్‌బాబు ఉన్నారు. వీరంతా విజయనగరం, విశాఖపట్నం, అన్నమయ్య, హైదరాబాద్, జగిత్యాల జిల్లాలకు చెందిన బాధితులు. వీరిని తమ స్వస్థలాలకు చేరుకునేలా న్యూఢిల్లీ నుంచే అవసరమైన ఏర్పాట్లు సంబంధిత అధికారులు చేసినట్టు తెలిపారు.


