
కార్మికుల కంటకన్నీరు..!
● జ్యూట్ ఫ్యాక్టరీ తెరిపించరా అంటూ
వేడుకోలు
● ఇచ్చిన హామీ నెరవేర్చాలని కోరిన కార్మికులపై మంత్రి ఆగ్రహం
● అపాయింట్‌మెంట్ లేకుండా ఎలా
వస్తారంటూ మండిపాటు
● విస్తుపోయిన కార్మికులు, నాయకులు
సాలూరు: పట్టణంలో శ్యామలాంబ పండుగ 15 ఏళ్ల తరువాత జరుగుతున్న నేపధ్యంలో ప్రజలందరూ పండగను ఘనంగా జరుపుకునేందుకు బంధువులకు పిలుపులు పెడుతూ సరదాగా పండగను చేసుకోవడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కాగా పట్టణానికి కూతవేటు దూరంలో ఉన్న జీగిరాం జ్యూట్ ఫ్యాక్టరీలో పనిచేసి, ఫ్యాక్టరీ మూతపడిన నేపథ్యంలో పట్టణంలో, మండలంలోని జీగిరాంతో పాటు పలు గ్రామాల్లో కార్మికుల పరిస్థితి దారుణంగా మారిన చిత్రాలు హృదయాలను కలిచివేస్తున్నాయి.నాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఫ్యాక్టరీని తెరిపిస్తామని హామీ ఇచ్చిన ప్రస్తుత మంత్రి సంధ్యారాణి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్నా ఆ దిశగా అడుగులు వేస్తున్న దాఖలాలు లేకపోవడంతో కూటమి ప్రభుత్వంపై ఆశలు పెట్టికున్న కార్మికుల కలలు కల్లలుగా మారిపోయాయి. అంతేకాదు ఇటీవల తమ గోడును వెళ్లబుచ్చుకుని ఫ్యాక్టరీ తెరిపిస్తామని నాడు ఎన్నికల సమయంలో హామీలిచ్చిన ప్రస్తుత మంత్రులు నారా లోకేష్, సంధ్యారాణిలకు ఆ హామీని అమలుచేయాలని కోరేందుకు ఇటీవల పలువురు జీగిరాం జ్యూట్ ఫ్యాక్టరీ కార్మికులు, నాయకులు మంత్రి సంధ్యారాణి ఇంటికి వెళ్లగా ,మంత్రి నుంచి వచ్చిన స్పందన చూసి కంగుతిన్నారు. అసలు అపాయింట్‌మెంట్ లేకుండా ఎలా వస్తారంటూ మంత్రి ఎదురు ప్రశ్నించడంతో సదరు కార్మిక సంఘం నాయకులకు గొంతులో పచ్చివెలక్కాయ పడిన పరిస్థితి ఎదురైంది. నాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలా నేడు మంత్రిగా మరోలా మారిన ఆమె తీరుపై కార్మికులు,నాయకులు పలు విధాలుగా చర్చించుకుంటున్నారు.
ఫ్యాక్టరీ తెరిపించేందుకు కృషిచేసిన
రాజన్నదొర
ఫ్యాక్టరీ నష్టాల్లో ఉందంటూ గత ప్రభుత్వం హయాంలో ఫ్యాక్టరీ యజమానులు లాకౌట్ విధించగా, నాడు ఉపముఖ్యమంత్రిగా ఉన్న రాజన్నదొర ఫ్యాక్టరీని తెరిపించి కార్మికులకు మేలు చేసేందుకు శతవిధాలుగా కృషిచేశారు. కార్మికుల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని ఫ్యాక్టరీ యజమానులు, కార్మిక నాయకులతో కలిసి చర్చలు జరిపించారు. ఈ విషయంపై ఉన్నతాధికారులతో మాట్లాడిన సంఘటనలు ఉన్నాయి. తరువాత ఎన్నికలు వచ్చిన క్రమంలో ఫ్యాక్టరీ తెరవాలంటూ కార్మికులు వద్ద ధర్నా చేపట్టగా నాడు సంధ్యారాణి వెళ్లి తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఫ్యాక్టరీ తెరిపిస్తామని హామీ ఇచ్చారు. నారా లోకేష్ సాలూరు పట్టణంలో ఎన్నికల సమయంలో నిర్వహించిన యువగళం సమావేశంలోను ఈ ఫ్యాక్టరీ తెరిపించి కార్మికులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. హామిలిచ్చిన ఇద్దరు నేతలు నేడు మంత్రులుగా ఉండి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సుమారు సంవత్సరం సమీపిస్తున్నా ఆ దిశగా అడుగులు పడకపోవడంతో కార్మికులు ఉసూరుమంటున్నారు.
వలసబాట పట్టిన కార్మికులు
1986లో ప్రారంభించిన ఈ ఫ్యాక్టరీలో వేలాది మంది కార్మికులు పనిచే శారు. ఫ్యాక్టరీ మూతబడడంతో వారంతా రోడ్డునపడ్డారు. కుటుంబపోషణ కష్టంగా మారడంతో కార్మికులు పొట్టకూటి కోసం వలసబాట పట్టారు. పలువురు ఏలూరు, రాజాంలతో పాటు వేరే రాష్ట్రాలకు వలస వెళ్లిపోయారు. కొందరు పట్టణంలో పండ్ల దుకాణాలు, టిఫిన్ దుకాణాల్లో పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. శ్యామలాంబ పండుగ జరగనుందని దూరప్రాంతాలకు పనులకు వెళ్లిన కార్మికులకు తెలియడంతో, ఫ్యాక్టరీ తెరిచి ఉండి ఉంటే అక్కడే పనిచేసుకుంటూ, కుటుంబాలతో ఘనంగా పండుగ చేసుకునే పరిస్థితి ఉండేదని బాధపడుతున్నారు. ఎన్నికల ముందు, ఎన్నికల్లోను ఈ ఫ్యాక్టరీని తెరిపిస్తామని హామీ ఇచ్చిన నేతలు, పార్వతీపురం మన్యం జిల్లాలో ఉన్న ఏకై క ఈ జూట్ ఫ్యాక్టరీని తెరిపించాలని కోరుతున్నారు. కాగా పక్కనున్న విజయనగరం జిల్లాలో ఫ్యాక్టరీలు పునఃప్రారంభమవుతుండగా ఈ జిల్లాలో ఆ దిశగా అడుగులు పడకపోవడం గమనార్హం.
ఇచ్చిన హామీని మంత్రి
నిలబెట్టుకోవాలి
టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే జీగిరాం జ్యూట్‌ఫ్యాక్టరీని తెరిపిస్తామని హామీ ఇచ్చిన మంత్రి సంధ్యారాణి ఆ హామీని నిలబెట్టుకుని ఫ్యాక్టరీని తెరిపించాలి. ఈ ఫ్యాక్టరీపై ఆధారపడిన వేలాది మంది కార్మికులు నేడు పొట్ట చేతపట్టుకుని వేర్వేరు రాష్ట్రాలకు వలసవెళ్లిపోయారు. ఫ్యాక్టరీ తెరిపించేందుకు మంత్రి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి.
–ఎన్‌వైనాయుడు, సీఐటీయూ జిల్లా కార్యదర్శి

కార్మికుల కంటకన్నీరు..!

కార్మికుల కంటకన్నీరు..!