
ఇద్దరి ప్రాణాలు నిలిపిన ప్రభుత్వ వైద్యులు
● కోమా స్థితిలో సర్వజన ఆస్పత్రిలో చేరిన రోగులు
విజయనగరం ఫోర్ట్: ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రికి వచ్చిన ఇద్దరు రోగుల ప్రాణాలను ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి వైద్యులు కాపాడారు. కోమా స్థితిలో ఆస్పత్రిలో చేరిన రోగులు ప్రస్తుతం కోలుకున్నారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శంబంగి అప్పలనాయుడు, జనరల్ మెడిసిన్ విబాగం హెచ్‌ఓడీ డాక్టర్ సుదర్శి అందించిన వివరాల ప్రకారం..పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం వాడపుట్టి గ్రామానికి చెందిన వెంకట ఈశ్వరరావు అనే బాలుడు సెరిబ్రల్ మలేరియా, న్యుమోనియాతో కోమాస్థితిలో ఈనెల5నప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో చేరాడు. బాలుడు మూగ, చెవిటి దివ్యాంగుడు. బాలుడిని ఆస్పత్రిలోని జనరల్ మెడిసిన్ విభాగం వైద్యులు ఐసీయూలో ఉంచి చికిత్స అందించారు. ప్రస్తుతం కోలుకున్నాడు. ఆస్పత్రిలో చేరినప్పుడు ఆహారం కూడా తీసుకోలేకపోయేవాడు. అలాగే బొండపల్లి మండలం మరువాడ గ్రామానికి చెందిన లక్కిడాపు అప్పారావు నెలరోజుల పాటు జ్వరంతో బాధపడడంతో సోడియం లెవెల్స్ తగ్గిపోయి కోమాలోకి వెళ్లిపోయాడు. దీంతో కుటుంబసభ్యులు ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో ఈనెల 5వతేదీన చేర్చారు. ఆ వ్యక్తికి వైద్య పరీక్షలు చేయగా బ్రెయిన్ టీబీ అని తేలింది. ప్రస్తుతం ఆ వ్యక్తి కూడా కోలుకున్నాడు. వారిద్దరికీ జనరల్ మెడిసిన్ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ బోళం పద్మావతి, అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ పద్మలత, హెచ్‌ఓడీ డాక్టర్ సుదర్శిలు వైద్యం అందించారు.

ఇద్దరి ప్రాణాలు నిలిపిన ప్రభుత్వ వైద్యులు