
హనుమాన్ జయంతికి సర్వం సిద్ధం
విజయనగరం టౌన్: వైశాఖ బహుళ దశమి ఈ నెల 22న గురువారం నిర్వహించే హనుమాన్ జయంతికి సర్వం సిద్ధం చేసినట్లు ప్రాజెక్ట్ చైర్మన్ మడిపల్లి వెంకటాచలం పేర్కొన్నారు. ఈ మేరకు స్థానిక పంచముఖ ఆంజనేయస్వామి ఆలయం ఆవరణలో మంగళవారం ఉత్సవ ఆహ్వాన కరపత్రాలను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆ రోజు ఉదయం 4 గంటల నుంచి స్వామివారికి పంచామృతాలతో అభిషేకాలు, లక్ష తమలపాకులతో అర్చనలు ఉంటాయన్నారు. ఉత్సవ కమిటీ చైర్మన్ జీఎస్.గుప్త మాట్లాడుతూ అదేరోజు సాయంత్రం చిన్నారులతో సిందూరార్చన, 27 రకాల పిండివంటలతో స్వామికి నైవేద్యం సమర్పిస్తామన్నారు. దేవాలయం కన్వీనర్ పెంటపాటి కామరాజు మాట్లాడుతూ భక్తులకు మంచినీరు మజ్జిగ, మధ్యాహ్నం 7వేల మందికి అన్నప్రసాద వితరణ ఏర్పాటుచేశామని తెలిపారు. భక్తులందరూ స్వామివారిని దర్శించి, తరించాలని కోరారు. కార్యక్రమంలో కలగర్ల నారాయణరావు, రామకృష్ణ, కేవీ. శంకరరావు, నాదం తదితరులు పాల్గొన్నారు.