
కదం తొక్కిన కార్మిక సంఘాలు
విజయనగరం గంటస్తంభం: కార్మికులను బానిసలుగా చేసే నాలుగు లేబర్ కోడ్‌లను రద్దు చేయాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేశాయి. ఈ మేరకు మంగళవారం అఖిల భారత కార్మిక సంఘాల పిలుపులో భాగంగా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. అ ధర్నాను ఉద్దేశించి సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్మి కె.సురేష్, ఏఐఎఫ్‌టీయు రాష్ట్ర నాయకులు బెహరా శంకర్రావు, ఐఎఫ్‌టీయు రాష్ట్ర నాయకులు ఎం.లక్ష్మి మాట్లాడుతూ..లేబర్ కోడ్‌లను రద్దు చేయాలి. కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలి. ప్రభుత్వ రంగ సంస్ధల ప్రైవేటీకరణ ఆలోచన విరమించుకోవాలి. మూతపడిన పరిశ్రమలను తెరిపించాలి. ఎనిమిది గంటల పని దినం అమలు చేయాలి. గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలి. నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. మోడీ ప్రభుత్వం కార్మిక, రైతుల వ్యతిరేక విధానాలు అమలు చేస్తూ ఆపరేషన్ కాగార్ పేరుతో ఆదివాసీలపై దాడులు చేస్తూ అటవీ ప్రాంతంలోని ఖనిజ సంపదను పెట్టుబడిదారులకు కట్టబెట్టే విధంగా వారికి కొమ్ము కాసేలా వ్యవహరిస్తోందన్నారు. అనేక పోరాటాలు చేసి సాధించుకున్న కార్మిక చట్టాలను, హక్కులను నేడు మారుస్తూ కార్మికులకు సంఘం పెట్టుకునే, సమ్మె చేసే హక్కు లేకుండా కట్టు బానిసలుగా చేసే ప్రయత్నం మోడీ ప్రభుత్వం చేస్తోందని ధ్వజమెత్తారు. ఇటువంటి పరిస్థితుల్లో జూలై 9న జరిగే జాతీయ సమ్మెను జయపద్రం చేయాలని కోరారు. కార్యక్రమంలో సీఐటీయు జిల్లా ఉపాధ్యక్షుడు టివీ.రమణ, నగర కార్యదర్శి బి.రమణ, ఆర్.శంకర్రావు, సుధీర్, శ్రీను, అప్పలరాజు, గిరి ప్రసాద్, బి.గీత, అప్పల సూరి, వెంకటలక్ష్మి, పార్వతి తదితరులు పాల్గొన్నారు.
కలెక్టరేట్ వద్ద ధర్నా